
గుర్తింపు ప్రతిష్టాత్మకం!
ఓసీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఒక్కో ఓటుకు రూ.10 వేల పైనే.. గతంలో ఎన్నడూ లేనంతగా ఖరీదైన ఎన్నిక మంత్రి రంగ ప్రవేశంతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలోని కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీ (ఓసీసీ) కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలను మించి ఈ ఎన్నికలు సాగుతున్నాయి. ఒక్కో ఓటుకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వెచ్చించేందుకూ వెనుకాడడం లేదంటే పరిస్థితి అర్థమవుతోంది. ఆరేళ్ల తర్వాత ఎ న్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పోటీ హోరా హోరీగా సాగుతోంది. 257మంది ఓటర్లు ఉండగా.. రెండేళ్ల పదవీ కాలానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడమే ఆసక్తి రేపుతోంది.
ఆధిపత్య పోరు
గతంలో ఎన్నికకు ముందు రెండు మూడు రోజులు మద్యం పంపిణీ, దావత్‌ల హడావుడి ఉండేది. అదీ గాక అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన వారే గుర్తింపు సంఘంగా గెలుపొందేది. ఈసారి అంతకుమించి అన్నట్లుగా నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ‘గడ్డం’ సోదరులైన వివేక్, వినోద్ ఓ వైపు.. మరోవైపు పీఎస్సార్(ప్రేమ్‌సాగర్‌రావు) అన్నట్లుగా పోటీ నెలకొంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ‘గడ్డం’ సోదరులతో మద్దతు తెలిపారు. ఆదివాసీల వ్యతిరేకతతో ఇటు రావడం మానేశారు. బయటకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నట్లుగా ఉన్నప్పటికీ మంత్రి, ఎమ్మెల్యేకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకే పార్టీలో ప్రజాప్రతినిధుల పోటీపై గాంధీభవన్ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కానీ ఎవరికీ అడ్డు చెప్పలేని స్థితిలో అధిష్టానం ఉండిపోయింది.
శిబిరాల్లో కార్మికులు
ఎన్నికల బరిలో ఐదు యూనియన్లు ఉన్నాయి. కానీ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఓ వైపు మంత్రి, మరోవైపు ఎమ్మెల్యే మద్దతు ఇస్తుండడంతో కా ర్మిక ఎన్నిక మరింత ఖరీదైంది. ఓ అభ్యర్థి తరఫున గత పది రోజులుగా 35మంది శిబిరంలోనే ఉన్నా రు. ఎన్నిక వాయిదా పడగా ఓ అభ్యర్థి తరఫున క్యాంపునకు వెళ్లిన వారంతా ఓసారి తిరిగి వచ్చి మళ్లీ రెండ్రోజులుగా క్యాంపులకు తరలుతున్నారు. 2019లో 272 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఓట్ల సంఖ్య 257 చేరింది. మరో తొమ్మిది మంది శిక్షణ ఉద్యోగులుగా ఉన్న ఓట్లు సీల్డ్ కవర్‌లో పెట్టి హై కోర్టుకు సమర్పించా లి. పోటీ తీవ్రమైతే వీరి ఓట్లకు ప్రాధాన్య త ఉంటుంది. ప్రతీ ఓ టును ఒడిసిపట్టి తమ వైపు మళ్లేలా రూ.లక్షలు కుమ్మరిస్తున్నారు.
కార్మికులకు తీరనికష్టాలు
1982లో బిర్లా సి.కే. యాజమాన్యంలో ఆరంభమైన ఓరియెంట్ సిమెంటు కంపెనీని ఏడాది క్రితమే అదాని గ్రూప్ సొంతం చేసుకుంది. యాజమాన్యం మారాక తొలి ఎన్నికలివి. సమస్యల్లో ప్రధానంగా శాశ్వత కార్మికులు తగ్గుతూ కాంట్రాక్టు కార్మికులు పెరుగుతున్నారు. ప్రస్తుతం 1800మంది వరకు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. కొన్నేళ్లుగా బోనస్ పెంచలేదు. శాశ్వత కార్మికులకు ఆరేళ్లలో రూ.2వేలు పెరిగాయి. స్థానికేతరులకు ఉద్యోగాలు, స్థానికులకు అవకాశాల లేమి, కొత్త నియామకాలు చేపట్టకపోవడం, గ్రేడ్‌ల ఇంక్రిమెంట్లలో జాప్యం తదితర సమస్యలున్నాయి.
ఎవరి బలమెంత?
బరిలో ఐదుగురు ఉండగా.. వీరిలో ఇద్దరు అభ్యర్థులు చేరో అభ్యర్థికి మద్దతు తెలిపి నామమాత్రం అయ్యారు. మరొకరు శాశ్వత కార్మికుడు పోటీలో ఉన్నారు. ఏడాది నుంచే కొక్కిరాల సత్యపాల్ పట్టు పెంచుకుంటున్నారు. తండ్రి రఘుపతిరావు చేసిన సేవలతో గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. అన్న పీఎస్సార్ మద్దతు ఉండడంతో కార్మికుల్లోనూ ప్రత్యేక దృష్టి ఉంది. తాను పార్టీతో సంబంధం లేకుండా నాన్న ఫొటోతో పోటీలో నిలబడ్డానని చెబుతున్నారు. ఇక మంత్రి వివేక్, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే వినోద్ ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారు. తమ అభ్యర్థి పుస్కూరి విక్రమ్‌రావు గెలుపు కోసం మంత్రి అనుచరులతో అక్కడే మకాం వేసి చెమటోడ్చుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రత్యర్థులు పై చేయి సాధిస్తే రాజకీయంగా ఇబ్బంది అవుతుందనే తీవ్రంగా కష్టపడుతున్నారు.
కార్మికేతరులే అధ్యక్షులుగా
కార్మికుల పేర్లు, ఫొటోలతో కాకుండా యూనియన్, రిజిష్టర్ నంబరుతోనే ఎన్నికలు జరుగుతాయి. దీంతో యూనియన్ తరఫున కార్మికేతర రాజకీయ, పలుకుబడి స్థానిక ఆధిపత్యమున్న నాయకులే అధ్యక్షులుగా గెలుస్తున్నారు. గతంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తండ్రి కొక్కిరాల రఘుపతిరావుతో సహా మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుస్కూరి వెంగళరావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, ఫిల్మ్‌డెవలప్‌మెంటు కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్‌రావు తదితరులు అధ్యక్షుడిగా గెలిచారు.