
జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 17.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. బెల్లంపల్లి మండలంలో 48.8 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 46, మందమర్రిలో 38.5, నస్పూర్‌లో 37.8, హాజీపూర్‌లో 33.3, కన్నెపల్లిలో 33, లక్సెట్టిపేటలో 26.5, కాసిపేటలో 21, తాండూర్‌లో 16.5, జన్నారంలో 14.5, దండేపల్లిలో 12, నెన్నెలలో 11.8, భీమినిలో 9.5, వేమనపల్లిలో 9.3, జైపూర్‌లో 8, చెన్నూర్‌లో 8, కోటపల్లిలో 4.5, భీమారంలో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
‘ఎల్లంపల్లి’ గేట్లు ఎత్తివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. ఆదివారం రాత్రి గేట్ల మూసివేసినప్పటికీ అర్ధరాత్రి నుంచి సోమవారం రోజంతా కురిసిన వర్షం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్ట్‌లోకి చేరుతుండడంతో గేట్ల ఎత్తివేత కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.950 టీఎంసీల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 80వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టులోని 32గేట్లు ఎత్తి 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ పథకానికి 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంప్‌హౌస్‌కు 3,200 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.

జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం