
దోస్త్ కావట్లే..!
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియలో మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తయినా ఆశించిన మేర భర్తీ కాలేదు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఉన్నత విద్యాశాఖ ఇంటర్ తర్వాత డిగ్రీలో చేరే విద్యార్థుల సౌకర్యార్థం దోస్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్–తెలంగాణ) పేరిట ఆన్‌లైన విధానంలో మే 3నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత తప్పిదాల దృష్ట్యా ఉన్నత విద్యామండలి అధికారులు ఈ విద్యాసంవత్సరం దోస్త్‌ను పక్కాగా చేపట్టారు. జిల్లాలో మంచిర్యాల చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో నాలుగు ప్రభుత్వ, 10 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. బీకాం, బీజెడ్సీ, బీఎస్సీ, బీఏ, కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో ప్రతీ కోర్సులు 60మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. వీటిల్లో 6,368 సీట్ల భర్తీకి గాను 3,261 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తయినా సగం ఖాళీగానే ఉండడంతో చివరి దఫాగా స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
ప్రైవేటుకు దీటుగా ప్రచారం
ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు విస్తృత ప్రచారం చేపట్టారు. సౌకర్యాలు, తదితర అంశాలపై విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, స్కాలర్‌షిప్, ఆధునిక ప్రయోగశాలలు, విశాలమైన ఆట మైదానాలు అంటూ కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. అయినప్పటికీ నాలుగు ప్రభుత్వ కళాశాలల్లో 2,160 సీట్లకు గాను 987మంది అడ్మిషన్లు పొందడం గమనార్హం.
ప్రైవేట్‌కూ తగ్గిన ఆదరణ
ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. పది కళాశాలలు ఉన్నా మూడు నాలుగింటిల్లో మాత్రమే చేరుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో 300 సీట్లకు గాను 30మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. వంద అడ్మిషన్లు దాటిన కళాశాలల్లో మరో మూడు ఉన్నాయి. మరో కళాశాల ఉన్నా లేనట్లేనని తెలుస్తోంది. కళాశాలలు మూతపడడానికి ఫీజు రీయింబర్స్‌మెంటు కారణంగా తెలుస్తోంది. విపరీతమైన కళాశాలల సంఖ్య పెరగడం, కోర్సులు ఎక్కువగా ఉండడం కూడా కారణమని తెలిసింది. ఇంటర్ తర్వాత విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల వైపు ఆసక్తి చూపడంతో డిగ్రీలో ప్రవేశాలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్నత చదువుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్, బైపీసీ తీసుకున్న వారు ఎంబీబీఎస్, ఇతర ప్రొఫెఫనల్ కోర్సుల్లో చేరికకు తల్లిదండ్రులు ఆలోచించడం కూడా డిగ్రీ కోర్సులపై ప్రభావం చూపుతోంది. జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో వసతి సౌకర్యం ఉండడంతో విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో
ప్రవేశాలు ఇవే..
కళాశాల సీట్లు ప్రవేశాలు
మంచిర్యాల 360 196
చెన్నూర్ 480 221
లక్సెట్టిపేట 660 245
బెల్లంపల్లి 660 327