
వరదల్లో నగరం
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రమైన మంచిర్యాల నగరంలో సోమవారం కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. టూటౌన్ ప్రాంతంలోని అన్ని కాలనీల్లో రోడ్లు వరద నీటిలో మునిగి, ఇళ్లలోకి వరద నీరు చేరి వస్తువులు తడిసిపోయాయి. హమాలీవాడ డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వరద నీరు రోడ్లపై పారి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరింది. రోడ్లు నీటితో నిండిపోవడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సూర్యనగర్ రోడ్డు నంబరు 2లో డ్రెయినేజీలు సక్రమంగా లేక వరదనీటితో కలిసి మురికి నీరు ఇళ్లలోకి చేరింది. డ్రెయినేజీల్లోని చెత్త తొలగించకపోవడం, దొరగారిపల్లె వెళ్లే రోడ్డుతోపాటు గోపాల్‌వాడ, గాంధీనగర్ నుంచి సూర్యనగర్ రోడ్డు నంబరు3కి వరద నీరు ముంచెత్తుతోంది. హమాలీవాడలోని రోడ్లన్నీ నీటిలో మునిగాయి. ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బృందావనం కాలనీ, చున్నంబట్టి వాడ, తిలక్‌నగర్‌లో రోడ్లు వరదలో మునిగాయి. తిరుమలగిరి కాలనీలోని డ్రెయినేజీ నిండి నీరు ఇళ్లల్లోకి చేరడంతో మాజీ కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో వరద నీటిని జేసీబీ సహాయంతో దారి మళ్లించారు. హైటెక్‌సిటీ కాలనీలోని రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. మాతాశిశు ఆరోగ్య కేంద్రా(ఎంసీహెచ్)న్ని వర్షపు నీరు చుట్టుముట్టింది. బాలింతలు, గర్భిణులు వరద నీటిలో ఆస్పత్రి లోపలికి వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. గత మూడేళ్లుగా ఏటా వర్షాకాలంలో గోదావరి వరద నీటిలో ఎంసీహెచ్ మునిగిపోవడం, అందులోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులను ఐబీ చౌరస్తాలోని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం, వర్షాకాలం ముగిసే వరకు ఎంసీహెచ్‌ను మూసే ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, రాళ్లవాగు ఉప్పొంగడంతో వరద నీటిలో ఎంసీహెచ్ మునిగే ప్రమాదం ఉందని, సిబ్బంది, బాలింతలు, గర్భిణులు ఆందోళన చెందుతున్నారు.

వరదల్లో నగరం

వరదల్లో నగరం