
ఐచర్ ఢీకొని వ్యక్తి మృతి
● న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించిన కుటుంబ సభ్యులు
తానూరు: భైంసా–నాందేడ్ రహదారిపై బెల్‌తరోడా ఎక్స్‌రోడ్డు వద్ద బుధవారం ఐచర్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. మహలింగి గ్రామానికి చెందిన బన్సోడే ప్రభుదాస్ (35) భార్య లక్ష్మి, కుమారుడు అరుతో కలిసి భైంసాకు వెళ్లాడు. బుధవారం స్వగ్రామానికి వెళ్లేందుకు బెల్‌తరోడా ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగారు. భార్య, కుమారుడిని అక్కడే కూర్చోబెట్టి మక్కబుట్టా తీసుకువచ్చేందుకు రోడ్డు దాటుతుండగా భైంసా నుంచి నాందేడ్ వైపు అతివేగంగా వెళ్తున్న ఐచర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ఆపకుండా వెళ్తుండడంతో స్థానికులు వెంబడించి మహారాష్ట్ర సరిహద్దులోని రాఠి గ్రామ శివారులో పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై షేక్ జుబేర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
న్యాయం చేయాలని రహదారిపై బైఠాయింపు
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు రహదారిపై బైఠాయించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం చోటు చేసుకుందని, పరిహారం అందేవరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

ఐచర్ ఢీకొని వ్యక్తి మృతి