
ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మంచిర్యాల అటవీ డివిజన్ అధికారి సర్వేశ్వర్‌తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నస్పూర్ మండలం సంగుమల్లయ్యపల్లెకు చెందిన ఎం.వెంకటేశం రికార్డుల నుంచి తన కూలిపోయిన ఇంటినంబర్ తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. ఈ సందర్భంగా మందమర్రి పట్టణానికి చెందిన దుర్గం మోహన్ తాను నెన్నెల శివారులో కొనుగోలు చేసిన భూమిని తనపేరుపై పట్టా చేయాలని కోరుతూ అర్జీ అందజేశాడు. భీమారం మండలం సుంకరిపల్లి కాలనీకి చెందిన దినసరి కూలీ దుర్గం భాగ్య ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరింది. నస్పూర్ శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన కోట మల్లయ్య 35 ఏళ్లుగా నివా సం ఉంటున్న ఇల్లు ఇటీవల వేరొకరి పేరుమీద మార్పు జరిగిందని దీనిని సవరించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. నస్పూర్ మండలం ఆర్‌కే 6 క్రిష్ణాకాలనీకి చెందిన హరీష్ సీ టైప్ క్వాటర్ల వద్ద పగిలిపోయిన సెప్టిక్ ట్యాంక్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరాడు. లక్సెట్టిపేట మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు మామిడి రాజశేఖర్ ఇంటర్ పూర్తి చేసి ఎల్‌టి శిక్షణ తీసుకున్నానని, ఏదైనా ఉపాధి చూపించాలని కోరుతూ అర్జీ అందజేశాడు. హాజీపూర్ మండలంలోని గుడిపేటకు చెందిన ఎంబడి జ్యోతి తన భర్త చనిపోయాడని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ అందజేసింది. నస్పూర్ శివారులోని సర్వేనంబర్ 42లో ఉన్న టీఎన్జీవో ప్లాట్లలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఆధ్వర్యంలో ఫిర్యాదు అందజేశారు. ఆయా శాఖల అధికారులు అర్జీలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
అక్రమ పట్టా రద్దు చేయాలి
బెల్లంపల్లిరూరల్: ఇళ్ల స్థలాలను అక్రమంగా చేసుకున్న పట్టాలు రద్దు చేసి తమపేరిట పట్టా జారీ చేయాలని కోరుతూ బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన బాధితులు ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌ను వేడుకున్నారు. గ్రామానికి చెందిన దుర్గం అంకులు, ఏగోలపు లక్ష్మి, గోమాస రామస్వామి, కలాలి ధర్మయ్య మాట్లాడుతూ సర్వే నంబర్ 162లో అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, అదే గ్రామానికి చెందిన కామెర నారాయణ గోమాస పోశం వద్ద మూడుగుంటల భూమిని కొనుగోలు చేసి 13 గుంటలుగా పట్టా పొందాడన్నారు. తాము నివసిస్తున్న ఇంటి స్థలాల్లో నూతన ఇంటి నిర్మాణలు చేపట్టకుండా అడ్డుకుని భయబ్రాంతులకు చేస్తున్నారన్నారు. అక్రమంగా ఉన్న 10 గుంటల పట్టాను రద్దు చేసి తాము నివసిస్తున్న ఇంటి స్థలాలకు పట్టా మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.