
పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెన్నూర్‌రూరల్: వర్షాలు కురవడంలో ఆలస్యమైన సమయాల్లో, వర్షాలు అధికంగా ఉన్న సమయాల్లో, వర్షాలు ముఖం చాటేసినప్పుడు పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ వివరించారు. కొన్ని సమయాల్లో అంతరపంటలు వేసుకోవాలని సూచించారు.
వర్షాలు ఆలస్యంగా వచ్చిన సమయంలో....
రుతుపవనాలు ఆలస్యమైన సమయాల్లో పత్తిలో స్వల్పకాలిక బీజీ–2 రకాలను ఎన్నుకోవాలి. 1–3 వంతు నత్రజని, 1–3 వంతు పొటాషియం, పాస్పరస్ మొత్తాన్ని దుక్కిలో వేసుకోవాలి. ఇలా చేయడంతో మొక్క లేత దశలో పెరుగుదల బాగా ఉంటుంది. తరచూ అంతరకృషి చేయాలి. ఇలా చేయడం వలన మొక్కకు కావాల్సిన తేమ అందుతుంది. కలుపు ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. దీంతో భూమిలోని తేమకు, పోషకాలకు మధ్య పోటీ ఉండదు.
తేమ ఉన్నప్పుడే..
వర్షాలు కురవడంలో ఆలస్యమైతే నేలలో సరిపడా తేమ ఉన్నప్పుడే ఎరువులు వాడాలి. లేదంటే 2 శాతం యూరియా ద్రావనాన్ని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాలి. తరచూ అంతరకృషి చేయడం వల్ల పంట కలుపు లేకుండా అలాగే మొక్కకు కావాల్సిన తేమ అందుతుంది. రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచాలి.
వర్షాలు అధికంగా కురిసిన సమయంలో....
వర్షాలు అధికంగా కురిసిన సమయంలో నీటిని కాలువల ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి. బూస్టర్‌గా 30 కిలోల నత్రజనిని హెక్టారుకు అందించాలి. అంతరకృషి చేసి నేలను తెరిచినట్లయితే ఎక్కువగా ఉన్న నీరు ఆవిరై పోతుంది. హీలియంతున్ ఉదృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు డైప్లూటెంజురాన్‌ను హెక్టారుకు 250–300 గ్రాములు పిచికారీ చేయాలి. పెరుగుదల అతిగా ఉంటే కొనలను తుంచివేయాలి. కాయకుళ్లు తెగులు రావడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి దానిని అదుపులో ఉంచుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేసుకోవాలి.
వర్షాలు ఆగిన సమయాల్లో
వర్షాలు ఆగిన సమయాల్లో మొక్కకు పోషకాలు అందించాలి. ఇందుకు గానూ 2 నుంచి 3 సార్లు 2 శాతం యూరియా ద్రావణాన్ని ఆకులపైన పిచికారీ చేయాలి. తరచూ అంతరకృషి చేసి కలుపు నివారణతో పాటు మొక్కకు కావాల్సిన తేమను అందజేస్తూ ఉండాలి. అంతర పంటలుగా పెసర, సోయాబీన్, మినుము వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలి.
వర్షాలు ముఖం చాటేస్తే..
వర్షాలు అసలే కురియకపోతే ఆగస్టు తర్వాత పత్తిని విత్తకూడదు. ఇలాంటి సూచనలు పాటించినట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారు.

పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు