‘నులి’పేద్దాం..! | - | Sakshi
Sakshi News home page

‘నులి’పేద్దాం..!

Aug 11 2025 7:20 AM | Updated on Aug 11 2025 7:23 AM

● నులిపురుగులతో ఆరోగ్యానికి చేటు ● 19 ఏళ్లలోపు వారిపై తీవ్ర ప్రభావం ● నివారణకు నేడు ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ ● ఉమ్మడి జిల్లాలో 7,24,227 మంది గుర్తింపు

రక్తహీనత.. పోషక లోపం..

ముఖ్యంగా 19 ఏళ్లలోపు పిల్లలపై నులి పురుగులు, ఏలికపాములు, కొంకి పురుగుల ప్రభా వం అధికంగా ఉంటుంది. ఇవి సంక్రమిస్తే పి ల్లల్లో రక్తహీనతకు గురవుతారు. పోషకాహార లోపం కనిపిస్తుంది. కడుపునొప్పితో పాటు శ రీరం బలహీనతగా అనిపిస్తుంది. ఆందోళనకు గురవుతారు. క్రమంగా బరువు కూడా తగ్గుతా రు. ఏకగ్రాత లోపిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. తదితర లక్షణాలు కనిపిస్తే నులి పురుగులు సంక్రమించినట్లుగా భావించాలని వైద్యులు పేర్కొంటున్నారు.

మంచిర్యాలటౌన్‌/లక్ష్మణచాంద/ఆదిలాబాద్‌టౌన్‌/కౌటాల: చిన్నారులను పట్టిపీడించే ఆరోగ్య సమస్యల్లో నులి పురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తుంటాయి. రక్తహీనత, పోషకలోపంతో పాటు పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయడం, చెప్పులు తొడుక్కోకుండా తిరగడం, ఆడుకోవడం, భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రపర్చుకోకపోవడంతో తరచూ పిల్లలు కడపునొప్పి, విరేచనాల బారిన పడుతుంటారు. చిన్నారుల పొట్టలో ఏళ్ల తరబడి తిష్టవేసి ఆరోగ్యాన్ని హరించే నులి పురుగులతో జాగ్రత్తలు తప్పనిసరని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ముందు జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రాణాంతకంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. నులి పురుగుల నివారణలో భాగంగా ప్రభుత్వం ఏటా రెండుసార్లు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 11న జాతీయ నులి పురుగుల నివారణ దినంగా జరుపుతున్నారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న చిన్నారులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 7,24,227 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వారందరికీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమవారం ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నారు.

నులి పురుగులు అంటే..

నులి పురుగులు అనేవి మానవుల్లో పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులు. ఇవి పిల్లలు ఆరుబయట మట్టిలో ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం, అపరిశుభ్ర పరిసరాలతో నులి పురుగులు చిన్నారుల చెంతకు చేరుతాయి. నులిపురుగులు కలిగిన చిన్నారులు నులి పురుగుల గుడ్లు కలిగిన మలంతో నేలను కలుషితం చేస్తాడు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఆరుబయట మట్టిని ముట్టడం, లేదా ఈ నులిపురుగుల గుడ్లు చేరిన ఆహారం తీసుకోవడం వల్ల ఇతర పిల్లల కడుపులోకి వెళ్లి అక్కడ వృద్ధి చెందడం మొదలు పెట్టి అక్కడే తిష్టవేస్తాయి. 19 ఏళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ఈ నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి.

చప్పరించి మింగాలి

అల్బెండజోల్‌ మాత్రలను మధ్యాహ్న భోజనం తరువాత అందించనున్నారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర, 2 నుంచి 3 సంవత్సరాల వారికి ఒక మాత్రను పొడి చేసి నీటితో మింగించాలి. 3 నుంచి 19 ఏళ్ల వారు ఒక మాత్రను చప్పరించి మింగాలి. ఇది నేరుగా మింగే మాత్ర కాదు. నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. సోమవారం మాత్రలు తీసుకోని వారికి ఈ నెల 18న మరోసారి మాత్రలు వేయనున్నారు.

ఉమ్మడి జిల్లాలో 1–19 ఏళ్లలోపు విద్యార్థులు

జిల్లా విద్యార్థులు

మంచిర్యాల 1,58,400

నిర్మల్‌ 1,91,998

ఆదిలాబాద్‌ 2,06,127

ఆసిఫాబాద్‌ 1,67,702

తప్పనిసరిగా వేయించాలి

1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయనున్నారు. కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – రాజేందర్‌,

జిల్లా వైద్యాధికారి, నిర్మల్‌

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూడాలి. పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి. స్వచ్ఛమైన నీటినే తాగాలి. చేతి గోర్లను చిన్నగా కత్తిరించుకోవాలి. భోజనానికి ముందు, తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్లకు చెప్పులు లేదా బూట్లు ఉంటేనే బయటకు వెళ్లాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

– హరీశ్‌రాజ్‌,

జిల్లా వైద్యాధికారి, మంచిర్యాల

ఏర్పాట్లు పూర్తి చేశాం

జిల్లా వ్యాప్తంగా నేడు అ న్ని ప్రభుత్వ, ప్రేవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆల్బెండజోల్‌ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు తప్పనిసరిగా 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ మాత్రలు వేయించాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను వేయించాలి.

– సీతారాం, డీఎంహెచ్‌వో, ఆసిఫాబాద్‌

‘నులి’పేద్దాం..!1
1/3

‘నులి’పేద్దాం..!

‘నులి’పేద్దాం..!2
2/3

‘నులి’పేద్దాం..!

‘నులి’పేద్దాం..!3
3/3

‘నులి’పేద్దాం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement