
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నస్పూర్: చిన్ననాటి నుంచి దేశానికి సేవ చేయాలని కన్న కలలు నెరవేరకుండానే రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడు మృత్యుఒడిలోకి చేరిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన చిలువేరు సాగర్(23), మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుష్నపల్లి గ్రామానికి చెందిన ఆకుల రాకేశ్, నిజామాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని ఓ డిఫెన్స్ అకాడామీలో శిక్షణ పొందుతున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్లేందుకు గిఫ్ట్ కొందామని బైక్‌పై బయల్దేరారు. స్థానిక రాయల్ గార్డెన్ చౌరస్తా సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ కట్టడంపై పడింది. దీంతో సాగర్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేశ్, విష్ణువర్ధన్‌ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాకేశ్ పరిస్థతి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. సీసీసీ నస్పూర్ ఎస్సై ఉపేందర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.