
ప్రమాదవశాత్తు కాలువలోపడి ఒకరు..
సోన్: ప్రమాదవశాత్తు కాలువలోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన బొడ్డు సుధాకర్ (37) ఆదివారం వరుసకు సోదరుడైన బొడ్డు పెద్ద లస్మన్నతో కలిసి పంటచేనుకు వెళ్లాడు. సరస్వతి కాలువలో లస్మన్న ఏర్పాటు చేసిన మోటార్ నుంచి నీళ్లు రాకపోవడంతో సుధాకర్ ఫుట్‌బాల్ పైపుకు తట్టుకున్న చెత్తను తీసివేసే క్రమంలో కాలుజారి కాలువలోపడి మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై నర్సయ్య తెలిపారు.