పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 25న జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే గ్రామ పరిపాలన అధికారి పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించే ఈ పరీక్షకు 155 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. ఉదయం 9:30 నుంచి అభ్యర్థులను అనుమతిస్తారని పేర్కొన్నారు. 10 గంటలకు గేట్లు మూసివేస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, ఐదుగురు కంటే ఎక్కువ గుంపుల నిషేధం వంటి చర్యలతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు హాల్‌టికెట్, గుర్తింపు కార్డు, బ్లూ/బ్లాక్ పెన్‌లు మాత్రమే తీసుకురావాలని సూచించారు.
డీఈఈటీతో ఉపాధి అవకాశాలు
జిల్లాలో నిరుద్యోగులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల వివరాలను డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఈఈటీ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ కమిటీ పురోగతిపై సమీక్షించారు. జూన్‌లో జాబ్ మేళాలు నిర్వహించి, యువతకు ఉపాధి కల్పించేందుకు కంపెనీల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. డిగ్రీ, పీజీ, నర్సింగ్ కళాశాలల యజమన్యాల సమన్వయంతో జాబ్‌మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిరుద్యోగులు deet.telangana.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. సమీక్షలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సి.రవికిరణ్, జిల్లా క్రీడలు, యువజన సేవల శాఖ అధికారి కీర్తి రాజ్‌వీర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వై.రమేశ్, టాస్క్, మెప్మా కార్మిక శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.


