విత్తన ఎంపికే కీలకం
మధ్యకాలిక రకాలు
దీర్ఘకాలిక రకాలు
బెల్లంపల్లి: వానాకాలం సమీపిస్తోంది. మరో పక్షం రోజుల్లోగా ఖరీఫ్ సీజన్ ఆరంభం కానుంది. ఇప్పటికే అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె మొదలు కానుంది. ఈ మేరకు రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్‌లో రైతులు అనువైన వరి వంగడాలను సాగు చేసుకోవాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త కోట శివకృష్ణ సూచిస్తున్నారు. పంట దిగుబడి, చీడపీడలు తట్టుకునే గుణం కలిగిన వరి వంగడాల గురించి వివరించారు.
వరి రకాలు
ఖరీఫ్ సీజన్‌లో సాగు చేయడానికి అనువైన వరి వంగడాలు దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రకం (150 రోజులు). ఈ రకం వంగడాలను జూన్ నెలాఖరు వరకు నాటుకోవాలి. మధ్యకాలిక రకాలు (135–140 రోజులు). జులై 15 వరకు నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలు (120–125రోజులు) జులై చివరి వరకు నార్లు పోసుకుని 25 రోజుల్లోపు నాట్లు వేయాలి.
స్పల్పకాలిక రకాలు
తెలంగాణ వరి–4 (జేజీఎల్–25958): ఈ రకం వంగడం స్వల్పకాలిక దొడ్డు గింజ రకం. 115 నుంచి 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. హెక్టారుకు 65 క్వింటాళ్ల నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది.
కూనారం వరి–2 (కేఎన్‌ఎం–1638): 120 నుంచి 125 రోజుల్లో పంట కోతకు వస్తుంది. హెక్టార్‌కు 76 నుంచి 85 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లికోడు, బయోటైప్–3, అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది.
బతుకమ్మ: హెక్టారుకు 70 క్వింటాళ్ల నుంచి 80 క్వింటాళ్ల పంట దిగుబడిని ఇస్తుంది. 115 నుంచి 120 రోజుల్లో పంటచేతికి వస్తుంది. ఎండాకు తెగులు, సుడిదోమ, పచ్చదోమ తట్టుకుంటుంది. విత్తన నిద్రావస్థ మూడు వారాలు ఉంటుంది. గింజ రాలేగుణం తక్కువ.
జగిత్యాల రైస్(జేజీఎల్–24423): 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టార్‌కు 85 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లికోడు, సుడిదోమ, గో ధుమ రంగు, ఆకుపచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజ రాలేగుణం తక్కువ. చేను నే లపై పడిపోదు. విత్తన నిద్రావస్థ రెండు వారాలు ఉంటుంది.
రైతులు సరైన వరి వంగడాలు ఎంచుకోవాలి
కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోట శివకృష్ణ
వరంగల్ రైస్–1 (డబ్ల్యూజీఎల్–915): ఈ రకం వంగడం పొడవు, దొడ్డు, గింజనాణ్యత కలిగి ఉంటుంది. అటుకులు, మరమరాల (పేలాలు) తయారీకి అనువైనరకం. 135 రోజులకు కోతకు వస్తుంది. వానాకాలం సాగుకు ఈరకం ఎంతో ఉత్తమమైంది. అగ్గి తెగులు, సుడిదోమ, ఎండాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. హెక్టార్‌కు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
కూనారం సన్నాలు(కేఎన్‌ఎం–118): ఈ రకం వంగడం 118 నుంచి 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. హెక్టార్‌కు 70 క్వింటాళ్ల నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. సుడిదోమను కొంతవరకు నివారిస్తుంది.
తెలంగాణ వరి–2 (డబ్ల్యూజీఎల్–697): ఈరకం వంగడం పంటకాలం 135 రోజులు. సన్నగింజ, నాణ్యతతో ఉంటుంది. హెక్టార్‌కు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులు, పొట్టకుళ్లు తెగులును తట్టుకుంటుంది.
సోమనాథ్: ఈ రకం వంగడం 130 నుంచి 135 రోజులకు పంట చేతికి వస్తుంది. హెక్టార్‌కు 65 నుంచి 70 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. సన్న గింజరకం. ఉల్లికోడును తట్టుకుంటుంది. అగ్గితెగులును కొంతవరకు తట్టుకునే శక్తి ఉంటుంది. నారుమడి దశలో కొంతవరకు చలిని సైతం తట్టుకుంటుంది.
కంపాసాగర్ వరి (కేపీఎస్ 2874): ఈరకం వంగడం 140 రోజుల్లో పంట చేతికి అందివస్తుంది. అధిక దిగుబడిని ఇస్తుంది. గింజలు సన్నగా ఉంటాయి. సాంబమసూరితో పోలిస్తే పైరు ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది. సుడిదోమ, అగ్గి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. హెక్టార్‌కు 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఇంద్ర (ఎంటీయూ–1061): ఈ రకం వంగడం 160 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టార్‌కు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. దోమను తట్టుకుంటుంది. నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయడానికి అనువైనది.
తెలంగాణ సోన (ఆర్‌ఎన్‌ఆర్–15048): ఈ రకం వంగడం పంట కాలం 125 రోజులు. హెక్టార్‌కు 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. అతి సన్నబియ్యం. తక్కువ నూక శాతంతో అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. గ్లైమిక్ ఇండెక్స్ తక్కువ.
జగిత్యాల సన్నాలు (జేజీఎల్–1798): ఈరకం వంగడం పంటకాలం 120 రోజులు. హెక్టార్‌కు 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లికోడును తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. సాగుకు అనువైన రక.
సాంబ మసూరి (బీపీటీ–5204): ఈ రకం వంగడం 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టార్‌కు 65 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. బియ్యం సన్నగా ఉంటాయి. అన్నం ఎంతో నాణ్యతగా ఉంటుంది. ఏ రకమైన చీడపీడలను తట్టుకోలేదు.
విత్తన ఎంపికే కీలకం


