
ఈ స్టేషన్‌లో రైళ్లు ఆగవు
● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ● పక్క స్టేషన్లకు వెళ్లాలంటే ఆర్థిక భారం
మందమర్రిరూరల్: సింగరేణి పారిశ్రామిక ప్రాంతం మందమర్రిలోని రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు హాల్టింగ్ కరువైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో స్థిరపడిన వివిధ ప్రాంతాల ఉద్యోగులు, వ్యాపారులు సొంతూళ్లకు, విద్యార్థులు చదువుల కోసం ఇతర పట్టణాలకు వెళ్లాలంటే పక్కనున్న బెల్లంపల్లి, రవీంద్రఖని, మంచిర్యాల రైల్వేస్టేషన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతీరోజు వందలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఈ రైల్వేస్టేషన్‌లో భాగ్యనగర్, ఇంటర్‌సిటీ, కరీంనగర్ పుష్‌పుల్ రైళ్లు తప్ప ఇతర రైళ్లు ఆగడం లేదు. గతంలో సింగరేణి, ప్యాసింజర్, రామగిరి, సిర్పూర్ కాగజ్‌నగర్(పాత తెలంగాణ) రైళ్లకు హాల్టింగ్ ఉండేది. కరోనా నుంచి రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా ఇప్పటికీ పునరుద్ధరించలేదు.
కనీస సౌకర్యాలు కరువు
మందమర్రి రైల్వేస్టేషన్ నుంచి ప్రతీరోజు భాగ్యనగర్, ఇంటర్ సిటీ రైళ్ల ద్వారా వందలాది మంది ప్ర యాణం సాగిస్తారు. రైల్వేస్టేషన్ ఆవరణలో మరుగుదొడ్డి, తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు తదితర కనీ స సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తెల్లవా రు జామున వచ్చే భాగ్యనగర్ రైలు ప్రయాణికులకు కొన్ని సమయాల్లో విద్యుత్ దీపాల సౌకర్యం లేక విష పురుగుల బాధ తప్పడం లేదు.
ఎంపీ చొరవ చూపాలి
మందమర్రి రైల్వేస్టేషన్‌లో గతంలో నిలిపివేసిన రైళ్ల హాల్టింగ్‌ను పునరుద్ధరించడంతోపాటు మరికొన్ని కొత్త రైళ్లు నిలిపే విధంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు కూడా ఎంపీ హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్రమంత్రితో మాట్లాడి కాజీపేట టు ఆజ్నీ ప్యాసింజర్ హాల్టింగ్‌కు కృషి చేశారు. తెలంగాణ రైలు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్లే మరికొన్ని కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
జీవనోపాధికి తిప్పలు
మందమర్రి రైల్వేస్టేషన్‌లో గతంలో పలు రైళ్లకు హాల్టింగ్ ఉన్నప్పుడు కనీసం 30నుంచి 40 మంది ఆటోడ్రైవర్లకు రోజుకు రూ.500 నుంచి రూ.600 వచ్చేది. భాగ్యనగర్, తెలంగాణ రైళ్లకు మాత్రమే హాల్టింగ్ ఉండడం వల్ల జీవనోపాధికి తిప్పలు తప్పడం లేదు. అన్ని రైళ్లకు గతంలో మాదిరిగా హాల్టింగ్ ఉన్నట్లయితే ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లభిస్తుంది.
– బెంజిమెన్ ఆటో డ్రైవర్, మందమర్రి
ప్రయాణానికి ఇబ్బంది
తెలంగాణ, సిర్పూర్ కాగజ్‌నగర్, తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా ప్రయాణించాంటే పక్కనున్న బెల్లంపల్లి, రవీంద్రఖని, మంచిర్యాల రైల్వేస్టేషన్లను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ఆటోలను ఆశ్రయించాల్సి రావడంతో ఆర్థిక భారంతోపాటు సమయం వృథా అవుతోంది. మందమర్రి రైల్వేస్టేషన్‌లోనే రైళ్లు నిలిపితే ఇబ్బంది తప్పుతుంది.
– అబ్బాస్, మందమర్రి

ఈ స్టేషన్‌లో రైళ్లు ఆగవు

ఈ స్టేషన్‌లో రైళ్లు ఆగవు

ఈ స్టేషన్‌లో రైళ్లు ఆగవు