
కార్టూన్ శివా‘నందం’
● కళారంగంలో ప్రతిభ ● రచయిత, కవి, జర్నలిస్టుగా గుర్తింపు
శివానంద్ గీసిన కార్టూన్లు
బెల్లంపల్లి: ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కార్టూనిస్ట్, రచయిత, కవి, జర్నలిస్టు, కళాకారుడిగా ప్రత్యేకత చాటుకుంటున్నాడు నూతి శివానంద్. కార్మికక్షేత్రం బెల్లంపల్లిలో పుట్టి పెరిగిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. తనదైనశైలిలో గీసిన కార్టూన్ బొమ్మలతో అందరినీ ఆలోచింపజేస్తున్నారు. చిలిపిచేష్టల కార్టూన్ బొమ్మలు, పదునెక్కిన పదాలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆలిండియా తెలుగు కార్టూనిస్ట్‌ల డైరెక్టరీలో చోటు సంపాదించుకుని మరో మెట్టుకు ఎదిగారు. కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన లాల్ పేరుతో కార్టూన్స్ వేసే సదాశివుని లక్ష్మణ్‌రావు అనే సీనియర్ కార్టూనిస్ట్ ఆ డైరెక్టరీని రూపొందించారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆ డైరెక్టరీలో ఇప్పటివరకు దాదాపు వందమంది వరకు మాత్రమే అవకాశం దక్కగా వీరిలో శివానంద్ ఒకరు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో వెలువడుతున్న మాసపత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తూనే సామాజిక సమస్యలపై కార్టూన్లు గీస్తూ జన జాగృతికి పాటుపడుతున్నారు.
కరోనా సమయంలో..
2019–21 వరకు రెండేళ్లలో కరోనా మహమ్మారి వి జృంబించింది. ఆ సమయంలో ప్రజలకు అవగా హన కల్పించడానికి శివానంద్ ఎన్నో కార్టూన్లు గీసి అధికారుల మన్ననలు పొందారు. వైద్య ఆరోగ్య, ఇతర శాఖల అధికారులు కరోనాపై అవగాహన కల్పించడానికి పలువురి నుంచి కార్టూన్లు సేకరించి సీడీల రూపంలో విడుదల చేశారు. ఇందులో శివా నంద్ వేసిన కార్టూన్లు ఉన్నాయి. అదేతీరుగా వివిధ సంస్థలు, పత్రికలు నిర్వహించిన కార్టూన్ పోటీల్లో ఆయన బహుమతులు గెలుచుకున్నారు. తొలుత పూర్తిపేరుతో కార్టూన్స్ వేసిన శివానంద్ ప్రస్తుతం తన ఇంటిపేరైన ‘నూతి ’పేరుతో గీస్తున్నారు.
నటుడిగా ప్రత్యేక గుర్తింపు
శివానంద్ కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ, టీవీ రంగాల వైపు దృష్టిసారించారు. నటుడిగా, రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సినీ దర్శకులు కె.రాఘవేందర్‌రావు, పి.చంద్రశేఖర్‌రెడ్డి, అల్లాణి శ్రీధర్ మరికొందరి వద్ద కోడైరెక్టర్‌గా పనిచేశారు. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పలు లఘుచిత్రాలు, సీరియల్స్, డాక్యుమెంటరీలకు రచన, దర్శకత్వం వహించారు. పాటలు రాసి పాడారు. ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన అభిషేకం సీరియల్‌కు మాటలు రాసి దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు చేతుల మీదుగా ఉత్తమ మాటల రచయితగా అవార్డు అందుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌లో ప్రసారమైన పురాణగాథలు, సీరియల్స్‌కు ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి సేవలందిస్తున్న శివానంద్‌ను పలువురు అభినందిస్తున్నారు.
ఆనందంగా ఉంది
చిన్నతనం నుంచే కళారంగం, రచనలు చేయడం అలవాటు. చదువుకునే రోజుల్లో ఎన్నో నాటకాలు రాశా. ప్రత్యేకంగా ఓ సాంస్కృతిక రంగాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు అవకాశం కల్పించా. కార్టూన్ రంగంలోనూ రాణిస్తుండటం ఆనందంగా ఉంది. సమాజ రుగ్మతలపై కార్టూన్లు గీస్తూ జన చైతన్యానికి పాటుపడటం నాకెంతో ఇష్టం.
– నూతి శివానంద్, కార్టూనిస్టు

కార్టూన్ శివా‘నందం’

కార్టూన్ శివా‘నందం’

కార్టూన్ శివా‘నందం’

కార్టూన్ శివా‘నందం’