
రైస్‌మిల్లులపై కొరడా!
● ‘సీఎంఆర్’ జాప్యంపై క్రిమినల్ కేసులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) ఇవ్వకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్న మిల్లులపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రతీ సీజన్‌లో ధాన్యం తీసుకోవడమే గానీ తిరిగి సకాలంలో బియ్యం ఇవ్వడంలో చాలామంది మిల్లర్లు మొండికేస్తున్నారు. జిల్లాలో గత 2022–23 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం ఇచ్చిన మిల్లుల్లో బియ్యం బకాయి ఉన్నవాటిని ఇప్పటికే బ్లాక్ లిస్టులో పెట్టారు. జిల్లాలో 21మిల్లుల వరకు ఇప్పటికీ బియ్యం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయి. గత కలెక్టర్ భారతీ హోళ్లికేరి వాటిని బ్లాక్ లిస్టులో పెట్టగా అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో మినహాయింపులు తెచ్చుకున్నారు. వీటిలో నాలుగు మిల్లులు పూర్తిగా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయి. కొన్నింటిలో ధాన్యం సైతం కనిపించడం లేదు. దీంతో వాటిపై క్రిమినల్ కేసులు నమోదుకు సిద్ధమయ్యారు. ఈ నెల 28న జైపూర్ మండలం ఇందారంలోని శివసాయి మిల్లుకు పౌరసఫరాల శాఖ అధికారులు పోలీసు సిబ్బందితో వెళ్లి క్రిమినల్ కేసు నమోదు చేయించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. బియ్యం విలువ, జరిమానాతోపాటు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా అధికారులు చెబుతున్నారు.
రైస్‌మిల్లుపై కేసు.. సీజ్
జైపూర్: మండలంలోని ఇందారం శివసాయి రైస్‌మిల్లు యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదుతోపాటు రైస్‌మిల్లు సీజ్ చేసినట్లు పౌరసఫరాశాఖ అధికారులు తెలిపారు. సీఎంఆర్ బియ్యం సకాలంలో ప్రభుత్వానికి అందజేయకుండా మోసానికి పాల్పడిన రైస్‌మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపారు. శివసాయి రైస్‌మిల్లు(మల్లికార్జున ట్రేడర్స్) యాజమాని గుంత రవికుమార్ ప్రభుత్వానికి అందజేయాల్సిన 2022–23, 24 సంవత్సరాలకు సంబంధించిన రూ.1.29కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి పట్టించినట్లు ఇటీవల రైస్‌మిల్లులో అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెల్లడైనట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు మిల్లు నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.