ఎంగేజ్‌మెంట్‌ తెల్లారే యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఎంగేజ్‌మెంట్‌ తెల్లారే యువకుడు దుర్మరణం

Jun 16 2023 6:28 AM | Updated on Jun 16 2023 9:47 AM

సంఘటన స్థలంలో మృతదేహం - Sakshi

సంఘటన స్థలంలో మృతదేహం

వాంకిడి(ఆసిఫాబాద్‌): ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుదామనుకున్న ఆ యువకుడు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన తెల్లవారే కానరాని లోకానికి వెళ్లిపోయాడు. కుమారుడి ఎదుగుదలను కళ్లారా చూద్దామనుకున్న ఆ తండ్రి కుమారుడి మరణవార్త విని తట్టుకోలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

వాంకిడి మండలంలోని సామేల గ్రామానికి చెందిన వసాకె తులసీరాం(21) ఆసిఫాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం అదే గ్రామానికి చెందిన యువతితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. కార్యక్రమానికి వచ్చిన బంధువుల్లో ఒకరిని దింపేందుకు గురువారం ఉదయం స్కూటీపై ఎల్లారం బయలుదేరాడు. తిరుగుప్రయాణంలో బుదల్‌ఘాట్‌ వాగు దాటాక జైత్‌పూర్‌ రోడ్డు వద్ద గల కంకర క్రషర్‌ సమీపంలో జాతీయ రహదారి–363పై ఎదురుగా వచ్చిన టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో తులసీరాంకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పురుగుల మందుతాగి తండ్రి ఆత్మహత్య
సామెల గ్రామానికి చెందిన వసాకే భీంరావు (45)ది వ్యవసాయ కుటుంబం. గ్రామ ఉప సర్పంచ్‌గా కూడా సేవలందిస్తున్నాడు. అతనికి కూతురు కళావతి, కుమారుడు తులసీరాం సంతానం. కుమారుడి మరణవార్త తెలుసుకున్న భీంరావు మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో ఆసిఫాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.

జాతీయ రహదారిపై ఉద్రిక్తత
తండ్రీకొడుకుల మృతికి కారణమైన డీబీఎల్‌ కంపెనీ యాజమాన్యం తీరుకు నిరసనగా సంఘటన స్థలం వద్ద గ్రామస్తులు, బంధువులు, యువజన సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ రహీముద్దీన్‌, వాంకిడి సీఐ శ్రీనివాస్‌, ఆసిఫాబాద్‌ సీఐ రాణాప్రతాప్‌, ఎస్సైలు రమేశ్‌, సాగర్‌, గంగన్న కంపెనీ యాజమాన్యం, బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. రూ.19 లక్షలకు ఒప్పందం జరగడంతో ఆందోళన విరమించారు.

అలుముకున్న విషాదఛాయలు
ఎంగేజ్‌మెంట్‌ జరిగిన తెల్లారే యువకుడు మృతి చెందడం, కుమారుడి మరణవార్త విన్న తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోవడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement