పాత కక్షలతో దాడి
ఆదిలాబాద్‌టౌన్: పాత కక్షతో దాడికి పాల్ప డిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన షేక్ అలీపై అదే కాలనీకి చెందిన మాస్ అలీ శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో నేత చౌక్ ప్రాంతంలో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. బాధితుడు మసీదులో నమాజ్ పూర్తి చేసుకుని బైక్‌పై కూర్చుని ఉండగా, మాస్ అలీ అక్కడికి వచ్చి పాత విభేదాలను మనసులో పెట్టుకుని దుర్భాషలాడి బైక్ కీతో తల, చేతిపై దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలి పారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు
పాత కక్షలతో చంపుతానని బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మాస్ అలీ శుక్రవారం నేతాజీ చౌక్ వద్ద గల మసీద్‌లో నమాజ్ చేసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఖలీల్ అనే వ్యక్తి పాత కక్షలు మనసులో పెట్టుకుని దుర్భాషలాడినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖలీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత
బెల్లంపల్లి: బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 12వార్డుకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య ఆరు ఓట్ల తేడా ఉండటంతో రీకౌంటింగ్ నిర్వహించారు. ఏ పార్టీ అభ్యర్థి గెలిచారో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించక ముందే ఇరు పార్టీల శ్రేణులు ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థి గెలిచారని సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. రీ కౌంటింగ్ జరుగుతోందని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోవాల్సిందిగా పోలీసులు సూచించారు. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కొద్ది నిమిషాల తేడాతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా బీఆర్‌ఎస్ అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను ప్రభావితం చేయడానికి వచ్చారా? అని ఎమ్మెల్యే వినోద్‌ను నిలదీశారు. దీంతో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం చెందారు. ఈక్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్తుండగా బీఆర్‌ఎస్ శ్రేణులు ‘డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు ‘ఎమ్మెల్యే వినోద్ జిందాబాద్’ అంటూ పోటీగా నినదించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతలోనే ఏసీపీ రవికుమార్, సీఐలు, ఎౖస్సైలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులను లాఠీలతో చెదరగొట్టి గొడవ జరగకుండా నివారించారు. అంతలోనే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.


