భైంసారూరల్: మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన రైతు దశరథ్ మొక్కజొన్న పంట శుక్రవారం దగ్ధమైంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడి పక్కనే ఉన్న పంట పొలంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మొక్కజొన్న చేనంతా మంటలు వ్యాపించాయి. రెండు గంటల్లో పంటచేనంతా కాలిబూడిదైంది. కోతకు వచ్చిన పంట కాలిపోవడంతో బాధిత రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు రూ.1.20లక్షల పంట కాలిపోయినట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.


