బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థి మృతి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థి మృతి

Feb 14 2026 9:08 AM | Updated on Feb 14 2026 9:08 AM

బీజేప

బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థి మృతి

● అనారోగ్యంతో వివాహిత మృతి ● ఆమె లేని లోకంలో ఉండలేక భర్త..

లక్సెట్టిపేట: మున్సిపల్‌ ఎన్నికల్లో లక్సెట్టిపేట పదోవార్డు బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ (68) అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటికి వచ్చి అనారోగ్యానికి గురై కింద పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కాగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించగా ఆమెకు 172 ఓట్లు రాగా, మూడో స్థానానికి పరిమితమైంది. కాగా, ఆమె మృతికి బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

లక్సెట్టిపేట: మండలంలోని శాంతాపూర్‌ గ్రామ స్టేజీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని దొనబండ గ్రామానికి చెందిన లక్ష్మయ్య (77) మృతి చెందినట్లు ఎస్సై సురేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మయ్య గురువారం అంకతిపల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి వేళ తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు మల్లికార్జున్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి సస్పెండ్‌

పెంచికల్‌పేట్‌: విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసినట్లు డీఈవో, జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అతడు తెలిపిన వివరాల ప్రకారం.. చేడ్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ తరగతి గదిలో పాఠాలు బోధించే సమయంలో అసభ్యకరంగా ప్రవరిస్తున్నారని, అనుచిత భాషతో సంభాషిస్తున్నారని విద్యార్థినులు హెచ్‌ఎం రాకేశ్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై హెచ్‌ఎం ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ డైరెక్టర్‌ (ట్రైబల్‌ వెల్ఫేర్‌) ఆధ్వర్యంలో పాఠశాలలో విచారణ జరిపారు. ఉపాధ్యాయుడిపైన వచ్చిన ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో అతడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

భార్య వెంటే భర్త

దహెగాం: వేద మంత్రాల సాక్షిగా నీ వెంట నేనుంటానని బాస చేసి భార్య మెడలో తాళి కట్టాడు. అనారోగ్యంతో ఆమె చనిపోగా తట్టుకోలేని అతడూ తనువు చాలించాడు. ఈ ఘటన మండలంలోని కమ్మర్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌కు మంచిర్యాల జిల్లా గురిజాల గ్రామానికి చెందిన సువర్ణతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవనం అన్యోన్యంగా సాగుతున్న క్రమంలో సువర్ణ అనారోగ్యానికి గురైంది. ఆమెకు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయంకాలేదు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఆమె దహన సంస్కారాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. కాగా, భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన వినోద్‌ (30) ఒక్కసారిగా సొమ్మిసిల్లి పడిపోయాడు. వెంటనే కుటుంబీకులు బెల్లంపల్లి ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో కమ్మర్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో వారి కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థి మృతి1
1/1

బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement