టికెట్‌ కోసం పోటాపోటీ! | Sakshi
Sakshi News home page

టికెట్‌ కోసం పోటాపోటీ!

Published Fri, May 19 2023 12:10 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ కోసం అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ లో పోటాపోటీ నెలకొంది. జిల్లాలో ఏకై క జనరల్‌ స్థానం మంచిర్యాల కావడంతో ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పలువురు ఈ స్థానం నుంచి పార్టీ టికెట్‌ ఆశిస్తుండడంతో రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీలకు, ఖానాపూర్‌ ఎస్టీలకు రిజర్వు అయ్యాయి.

మంచిర్యాల మాత్రమే జనరల్‌ స్థానం కావడంతో అనేకమంది టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఏడాది చివరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి అభ్యర్థులు బీ ఫారం కోసం రంగంలోకి దిగారు. ఇందులో సీని యర్ల నుంచి కింది స్థాయి నాయకుల వరకు అంద రూ ఉన్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. పోటీలోనే ఉంటామని సంకేతాలు ఇస్తున్నారు. అంతేగాకుండా ని యోజకవర్గ ప్రజల్లో మద్దతు కూడగట్టుకునేలా పర్యటనలు చేస్తున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని మార్చుతారనే కోణంలోనే అభ్యర్థులు పోటీ పడుతున్నారు.


‘బీసీ కార్డు’తో అభ్యర్థిత్వం
పార్టీలో ఉన్న పలువురు బీసీ నాయకులు టికెట్‌ ఆశిస్తున్నారు. బీసీ కోటాలో మంచిర్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్న గాజుల ముఖేశ్‌గౌడ్‌ ఆశలు పెట్టుకున్నారు. బీసీ నాయకులకు చాన్స్‌ ఇస్తే పోటీకి సిద్ధపడినట్లు చెప్పుకుంటున్నారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్‌లో చేరాక టికెట్‌ ఆశిస్తున్నారు. కార్మిక సంఘాలు, సంస్థలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఈయనతోపాటు పలువురు బీసీ నాయకులు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.

రేసులో ‘పుస్కూర్‌’
బీఆర్‌ఎస్‌ నుంచే మరో నాయకుడు, రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, సినీ నిర్మాత పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు సైతం టికెట్‌ బరిలో ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలోనూ టికెట్‌ ఆశించారు. చివరకు కార్పొరేషన్‌ పదవి దక్కింది. ప్రస్తుతం కాసిపేట మండలం దేవాపూర్‌లో ఉన్న ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ(ఓసీసీ) గుర్తింపు కార్మిక సంఘ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ పర్యటనలోనూ ఆయన వెంట ఉన్నారు. తాజాగా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. ఈసారి టికెట్‌ ఇవ్వాలని సంకేతాలు పంపుతున్నారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తను కూడా టికెట్‌ కోసం రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ‘మేం కూడా టికెట్‌ ఆశిస్తున్నాము. అయితే పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసి పని చేస్తామ’ని చెబుతూనే తన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ముందుంచుతున్నారు.

పట్టుబిగిస్తున్న ‘పురాణం’
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ ఉద్యమం నుంచి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ పార్టీలో సీనియర్‌ నాయకులుగా ఉన్నారు. తూర్పు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆసిఫాబాద్‌, మంచిర్యాల పరిధిలోని ఐదు నియోజకవర్గాలను సమన్వయం చేసిన పేరుంది. కొత్త జిల్లాల అధ్యక్షులుగా ప్రకటించే వరకు 14ఏళ్లపాటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఉద్యమంలో పలుమార్లు జైలుకు వెళ్లారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఆయనతో ఉన్నారని చెబుతారు. గతంలో మంచిర్యాల, సిర్పూర్‌లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలనుకున్నా కుదరలేదు.

చివరకు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రెండోసారి ఆయనకే అవకాశమిస్తారని అనుకున్నా ఇవ్వలేదు. ఈ క్రమంలో మంచిర్యాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మారిస్తే తనకే తప్పకుండా సీటు ఇస్తారనే ఆశతో ఉన్నారు. తాను కూడా బరిలో ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. నియోజకవర్గంపై దృష్టి సారించి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా దండేపల్లి, హాజీపూర్‌, జిల్లా కేంద్రంతో సహా బొగ్గు గని కార్మికులతో స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. కార్యకర్తలతో నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు.

పార్టీ కేడర్‌తో టచ్‌లో ఉంటున్నారు. ప్రజాసమస్యలపై స్పందిస్తున్నారు. ‘పురాణం’కు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో సన్నిహితులుగా పేరుంది. ‘ఉద్యమ కాలం నుంచి పార్టీలో పని చేస్తున్నాం. ఎన్నో కష్టాలకు ఓర్చి పార్టీని బలోపేతం చేశాం. మాకు కూడా టికె ట్‌ అడిగే హక్కు ఉంటుంద’ని ‘పురాణం’ తన అ భ్యర్థిత్వాన్ని బయటపెడుతున్నారు. అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement