సీఎం సార్‌.. ఏమిటీ వివక్ష! | - | Sakshi
Sakshi News home page

సీఎం సార్‌.. ఏమిటీ వివక్ష!

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రయోజనం చేకూరే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం తర్వాత పనుల పునరుద్ధరణకు సాంకేతిక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. వారి సలహాతో ఈ ఏడాది ఫిబ్రవరి 16న మొదట ఔట్‌లెట్‌ టన్నెల్‌ వైపు, మార్చి 18న ఇన్‌లెట్‌ వైపు డ్రిల్లింగ్‌, బ్లాస్టింగ్‌ పద్ధతి (డీబీఎం)లో సొరంగం తవ్వకాలు చేపట్టారు. సొరంగం మొత్తం పొడవు 43.930 కిలోమీటర్లు కాగా.. ప్రమాదానికి ముందు ఔట్‌లెట్‌ నుంచి 20.426 కి.మీ.లు.. ఇన్‌లెట్‌ నుంచి 13.955 కి.మీ.లు తవ్వక పనులు పూర్తి చేశారు. ప్రమాదం అనంతరం తిరిగి పనులు ప్రారంభమైన తర్వాత ఔట్‌లెట్‌ నుంచి 644 మీటర్లు, ఇన్‌లెట్‌ నుంచి 359 మీటర్లు.. మొత్తంగా రెండు వైపుల నుంచి కిలోమీటర్‌ మేర తవ్వకం పూర్తి చేశారు. జపాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న త్రీ ఆర్మ్‌ బూమర్‌ మిషన్లతో అడ్వాన్స్‌డ్‌ టన్నెలింగ్‌ మెథడ్‌ విత్‌ అబ్జర్వేషన్‌ టెక్నిక్స్‌ (ఏటీఎంఓటీ)తో ఇరువైపులా సొరంగం తవ్వకం పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రోజుకు మూడు విడతల్లో 400 మంది పాల్గొంటున్నారని.. గడువు లోపు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

● 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌, నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల పరిధిలో సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో సీఎం ఎంఎన్‌కేఎల్‌ఐకి శ్రీకారం చుట్టారు. ఈ ఎత్తిపోతలకు సంబంధించి పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియ చకచకా పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో భూసేకరణ, కాల్వల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

నత్తేనయంలా పీఆర్‌ఎల్‌ఐ పనులు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో సుమారు 12.30 లక్షల ఎకరాలకు సాగుతో పాటు తాగు నీరందించాలనే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నాయి. మొదటి దశలో ఐదు రిజర్వాయర్ల పరిధిలో ప్రధాన పంప్‌హౌస్‌ల పనులు కొలిక్కి వచ్చినా.. కాల్వల తవ్వకం, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌, నిర్వాసితుల పునరావాస పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

డిసెంబర్‌లోగా సాధ్యమేనా..

ప్రస్తుతం నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు ఓపెన్‌ కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తంగా 5.92 కిలోమీటర్ల మేర ఓపెన్‌ కాల్వ కాగా.. బీఆర్‌ఎస్‌ హయాంలో రెండు కి.మీల మేర తవ్వకం పూర్తయింది. 3.92 కి.మీల మేర బండరాయి ఉండగా.. పెండింగ్‌లో పెట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు తొలి ఏడాది వరకు ఈ పనులు ముట్టుకోలేదు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో 2026 డిసెంబర్‌ లోగా ఈ పనులు పూర్తి చేసి నార్లాపూర్‌ నుంచి కరివెన వరకు నీళ్లందించనున్నట్లు సీఎం ప్రకటించారు. రూ.100 కోట్లు కేటాయించగా.. పనులు పట్టాలెక్కాయి. 3.22 కి.మీల మేర పై లేయర్‌ తవ్వకాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా సుమారు 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలు జరపాల్సి ఉంది. అయితే భూపరిహారానికి సంబంధించి స్థానిక రైతుల ఆందోళనలతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్దేశిత డిసెంబర్‌లోపు ఈ పనులు పూర్తి చేసి నార్లాపూర్‌ నుంచి కరివెన వరకు నీళ్లందిస్తామని పీఆర్‌ఎల్‌ఐ ఇన్‌చార్జి ఎస్‌ఈ రవీందర్‌ చెబుతున్నా.. గడువు నాటికి పనుల పూర్తి గగనమేనని, మరో నాలుగైదు నెలలు పట్టొచ్చని ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రిజర్వాయర్ల వారీగా ప్రస్తుత పరిస్థితి ఇలా..

వీరాంజనేయ (ఏదుల): నిల్వ సామర్థ్యం 6.55 టీఎంసీలు. దీని కింద ఆయకట్టు లేదు. మోటార్ల బిగింపు పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

అంజనగిరి (నార్లాపూర్‌): నిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు. దీని కింద ఆయకట్టు లేదు. ప్రస్తుతం కాల్వలు, ఇతర అనుసంధాన పనులు కొనసాగుతున్నాయి.

వెంకటాద్రి (వట్టెం): ఈ రిజర్వాయర్‌ నిల్వ సామర్థ్యం 16.74 టీఎంసీలు. దీని కింద 1.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పంప్‌హౌస్‌ ఎలక్ట్రో మెకానికల్‌ పనులు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

ప్రాజెక్ట్‌ల ప్రాధాన్యతలో తేడా.. పనుల్లో అసమతుల్యత

ఒకవైపు పరుగులు పెడుతున్న ఎస్‌ఎల్‌బీసీ, కొడంగల్‌ ఎత్తిపోతల పనులు

మరోవైపు పాలమూరు జీవనాడిపీఆర్‌ఎల్‌ఐపై చిన్నచూపు

ఈ ఏడాది డిసెంబర్‌లోగానార్లాపూర్‌–కరివెన పూర్తి గగనమే?

మరో నాలుగైదు నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు ఇంజినీర్ల అంచనా

ఈ లెక్కన మరో ఏడాది వరకు పంటల సాగు కష్టమేనని రైతుల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement