ఏసీబీ వేట.. త్రుటిలో తప్పించుకున్న రెవెన్యూ అధికారి? | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వేట.. త్రుటిలో తప్పించుకున్న రెవెన్యూ అధికారి?

Nov 26 2026 12:59 AM | Updated on Nov 26 2026 12:59 AM

● రూ.1.50 లక్షల నగదుపై సోషల్‌ మీడియాలో ప్రచారం

● భూ విభజనలు, నాలా మార్పిడుల్లో అక్రమ వసూళ్ల ఆరోపణలు

నారాయణపేట/మహబూబ్‌నగర్‌ క్రైం: నారాయణపేట జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి రూ.1.50 లక్షల నగదుతో వెళ్తుండగా ఏసీబీ అధికారులు వెంబడించారంటూ బుధవారం సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. దేవరకద్ర ఫ్లైఓవర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు ఈ వ్యవహారం సాగినట్లు సోషల్‌ మీడియా లో ప్రచారం జరుగుతున్నా.. దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. మరోవైపు జిల్లాలో తాము ఎలాంటి తహసీల్దార్‌ కార్యాలయంపై దాడులు చేయలేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

భూ వ్యవహారాల్లో వసూళ్ల ఆరోపణలు

నారాయణపేట జిల్లాలోని ఓ తహశీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా భూ విభజనలు, నాలా మార్పిడులు, అనుమతులు లేని లేఅవుట్ల వ్యవహారాల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10 శాతం భూమి, డీటీసీపీ అనుమతుల నిబంధనలను పట్టించుకోకుండా భూములను చి న్నచిన్న భాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్లకు మా ర్గం సుగమం చేస్తున్నారనే విమర్శలున్నాయి. రెండు, మూడు గుంటల చొప్పున సబ్‌ డివిజన్లు చేసి, అనంతరం నాలా మార్పిడులు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ రెవెన్యూ అధికారి కారులో రూ.1.50 లక్షలకు పైగా నగదుతో వెళ్తుండగా ఏసీబీ బృందం వెంబడించిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. దేవరకద్ర ఫ్లైఓవర్‌ వద్ద ఏసీబీ వాహనానికి, సంబంధిత అధికారి కారుకు మధ్య దూరం పెరిగిందని, మహబూబ్‌నగర్‌లో వాహనాల రద్దీ కారణంగా అధికారులు ముందుకు వెళ్లలేకపోయారని సోషల్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారానికి సంబంధించి నగదు ఎవరిది, ఏసీబీ తనిఖీలు జరిగాయా, అధికారి తప్పించుకున్నారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. సదరు రెవెన్యూ కార్యాలయంపై గతంలోనూ ఏసీబీ దాడి ప్రయత్నం జరిగిందని, కొందరు స్థానికుల నాయకుల జోక్యంతో అది నిలిచిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూ విభజనలు, నాలా మార్పిడులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులను ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించి ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement