హన్వాడ: రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ రీసర్వే చేపట్టిందని, ఈప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలో పర్యటించిన ఆయన, మాధారంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పొలాల్లో జరుగుతున్న సర్వే తీరును స్వయంగా సమీక్షించి పనుల పురోగతిపై తహసీల్దార్ కిష్ట్యానాయక్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు నెలలుగా గ్రామంలో భూ రీసర్వే ప్రక్రియ సజావుగా సాగుతోందని, దీని ద్వారా హద్దుల వివాదాలు తొలగి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తహసీల్దార్ ఎమ్మెల్యేకు వివరించారు. సర్పంచ్ సుదర్శన్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


