వీపనగండ్ల: త్యాగాల పురిటిగడ్డ తెలంగాణలో గద్దర్ ఆశయాలు నెరవేర్చాలని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్, గద్దర్ కుమార్తె వెన్నెల అన్నారు. గురువారం వీపనగండ్లలో ప్రజా ఉద్యమ నాయకుడు ఎత్తం కృష్ణయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గద్దర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. గద్దర్ వ్యక్తి కాదు.. ఒక శక్తి అని.. హక్కుల సాధనలో అలుపెరగని పోరాటాలు నిర్వహించి ఉద్యమకారులకు చైతన్యమూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. తన తండ్రి విగ్రహాన్ని వీపనగండ్లలో ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రజల మదిలో మెదిలేలా చేసిన ఎత్తం కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. అణగారిన కులాల అభ్యున్నతి కోసం ఆనాడు కొనసాగిన ఉద్యమాలు భూస్వామ్య, ప్రభుత్వ వర్గాల ద్వారా జరిగిన నిర్బంధాలపై కార్యక్రమంలో పాల్గొన్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రజా గాయకులు సంజీవ్, ప్రొఫెసర్లు లక్ష్మణ్, వెంకటేష్ ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సత్యశోధక్ సమతా సమాజ్ నాయకులు శ్రీనివాసులు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.


