తెలకపల్లి: కాపర్ కేబుల్ వైర్ దొంగిలించిన నలుగురి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం.. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ బోరు మోటార్ల వద్ద కాపర్ వైర్ దొంగతనం చేసి అమ్మేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ మేరకు తెలకపల్లి గ్రామానికి చెందిన పుల్జాల క్రాంతికుమార్, బారిగారి ధన్‌రాజ్ (దామోదర్), పోనిగారి చందు ముగ్గురు స్నేహితులు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంలో వ్యవసాయ బోర్ల ఎలక్ట్రిక్ కేబుల్ వైర్లను దొంగతనం చేసి గట్టయ్య అనే వ్యక్తికి అమ్మేవారన్నారు. ఈ నెల 17న మండలంలోని పర్వతాపూర్ గ్రామ శివారులో చెరువు వద్ద ఉన్న నాలుగు వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్లన్ కట్ చేసి తీసుకువెళ్లి.. కాపర్ వైర్‌ను వేరుగా చేసి దాచిపెట్టారు. అనంతరం కాపర్ వైర్‌ను అమ్మేందుకు తీసుకెళ్తుండగా తెలకపల్లి పశువుల సంత సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు చిక్కారు. వారి వద్ద 5 కిలోల కాపర్ వైర్, చోరీకి ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే లక్నారం గ్రామ శివారులో చోరీ చేసిన 1.7 కిలోల కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాత సామగ్రి కొనుగోలు చేసే గట్టయ్యతోపాటు పై ముగ్గురిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.


