ఏళ్ల వెట్టి.. ఒక్క ఫోన్‌కాల్‌తో విముక్తి! | - | Sakshi
Sakshi News home page

ఏళ్ల వెట్టి.. ఒక్క ఫోన్‌కాల్‌తో విముక్తి!

Nov 20 2026 1:31 AM | Updated on Nov 20 2026 1:31 AM

● ముందస్తు అప్పుల పేరుతో వేతనాలు ఎగ్గొట్టి శ్రమదోపిడీ

● 080–69434343 టోల్‌ఫ్రీ

నంబర్‌తో వెలుగులోకి వచ్చిన ఉదంతం

● నారాయణపేటలో తనిఖీలు.. ఎనిమిది మందికి విముక్తి

● బాధితులకు విడుదల ధ్రువీకరణ పత్రాలు అందజేత

నారాయణపేట: చదువుకోవాల్సిన వయసులో ఆ బాలుడు కూలీగా మారాడు.. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధుడు ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ దంపతులకూ అప్పులే సంకెళ్లయ్యాయి. చిన్నపాటి ముందస్తు అప్పులు.. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీకి కారణమయ్యాయి. ఐదేళ్ల నుంచి 20 ఏళ్లుగా మేసీ్త్రల వద్ద పనిచేస్తున్న ఎనిమిది మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో ఓ టోల్‌ఫ్రీ కాల్‌ వెలుగులు నింపింది. తమ గోడును బయటపెట్టేందుకు 080–69434343 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు చేరువయ్యారు. సామాజిక కార్యకర్తల చొరవతో అధికారులు స్పందించడంతో నవంబర్‌ 18న నారాయణపేటలో సంయుక్త తనిఖీలు నిర్వహించి వారందరికీ విముక్తి కల్పించారు. బాధితుల్లో 16 ఏళ్ల బాధితుల నుంచి 78 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వనపర్తి మండలం అప్పయ్యపల్లికి చెందిన డి.ప్రవీణ్‌కుమార్‌, హన్వాడ మండలం బుడ్డారం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు ఎం.శేఖర్‌, ఎం.కర్మయ్య, మడల్రెడ్డి అంజమ్మ, కామరం వైష్ణవి, పెద్దమందడి మద్దిగట్లకు చెందిన బాలస్వామి, నట్టి నాగమ్మ, దేవరకద్ర మండలం లక్ష్మిపల్లి కవాలి బాలరాజు ఉన్నారు.

టోల్‌ఫ్రీ నంబరే కొండంత ధైర్యం

వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ప్రచారం చేసిన 080–69434343 టోల్‌ఫ్రీ నంబర్‌ బాధితులకు అండగా నిలిచింది. తమ కష్టాలను సామాజిక కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లడంతో హైదరాబాద్‌కు చెందిన అధిభూమి చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు దాసరి రాములు, అడ్డాకుల వెంకటరాజు, అముదాల సత్యనారాయణ గౌడ్‌, మద్దిరాజలింగం తదితరుల రక్షణ బృందం రంగంలోకి దిగింది. వనపర్తికి చెందిన గుంపు మేసీ్త్రలు నాగస్వామి, చంద్రయ్యతోపాటు ఇతర ప్రాంతాల్లో వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులపైనా బృందం స్పందించింది.

● నారాయణపేట మండలం సింగారం గేటు సమీపంలోని రాజీవ్‌ గృహకల్ప వద్ద నవంబర్‌ 18న అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా రక్షణ బృందంతో కలిసి కార్మిక, పోలీసు, శిశు సంక్షేమ శాఖల అధికారులు విచారణ చేపట్టారు. ఎనిమిది మందిని గుర్తించి రక్షించిన అనంతరం తదుపరి విచారణ నిమిత్తం ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు.

విడుదల పత్రాలతో కొత్త ఆశలు

నారాయణపేట ఆర్డీఓ ఎల్‌.రమేశ్‌ బుధవారం సాయంత్రం ఎనిమిది మంది బాధితులకు విడుదల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 1976 వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం ప్రకారం పునరావాస సహాయం, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు ఈ పత్రాలు ఉపయోగపడనున్నాయి. ఏళ్ల తరబడి అప్పుల సంకెళ్లలో మగ్గిన బాధితులు ఇప్పుడు స్వేచ్ఛా జీవితంపై ఆశలు పెంచుకుంటున్నారు. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.

నెలకు రూ.8 వేల వేతనం ఇస్తామని చెప్పి పనిలోకి తీసుకున్న మేసీ్త్రలు.. ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా ముందస్తు నగదు, పాత అప్పుల కింద జమ చేసేవారని బాధితులు వెల్లడించారు. అప్పు తీరే వరకు పని ప్రదేశం విడిచి వెళ్లకుండా, సొంత ఊళ్లకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు విచారణలో వెల్లడైంది. ఇలా అప్పు ఎప్పుడు తీరుతుందో తెలియక ఏళ్ల తరబడి శ్రమించాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాలకు చెందిన ఎనిమిది మంది ఈ వెట్టిచాకిరీలో చిక్కుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement