తిమ్మాజిపేట: మండలంలోని బావాజిపల్లిలో పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాపగారి మహేష్(21) తండ్రి ప్రైవేటు బస్సు నడిపేందుకు వెళ్లడంతో తన వ్యవసాయ పొలానికి వెళ్లి అక్కడే పురుగుమందు తాగి ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చుట్టుపక్కల వారు గుర్తించి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. మృతుడి తండ్రి పాపగారి బంగారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడు మృతి
అచ్చంపేట రూరల్: పట్టణంలోని పాత బస్టాండు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువయ్య (70) మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గురువయ్య రోడ్డు దాటుతున్న సమయంలో బొమ్మన్‌పల్లికి చెందిన ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పట్ట ణంలో టైలరింగ్ పని చేసుకుంటూ కుటుంబా న్ని పోషించుకుంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లీలమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
విద్యుదాఘాతానికి
గురై గడ్డి డీసీఎం దగ్ధం
భూత్పూర్ (అడ్డాకుల): మూసాపేట మండలంలోని జానంపేట వద్ద గురువారం విద్యుదాఘాతానికి గురై గడ్డి లోడ్‌తో వెళ్తున్న డీసీఎం దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాకు చెందిన ఓ రైతు జానంపేటకు చెందిన టైలర్ చెన్నయ్యకు చెందిన వరి గడ్డిని కొనుగోలు చేశాడు. గడ్డిని డీసీఎంలో కర్నూల్‌కు తీసుకెళ్తున్న సమయంలో జానంపేట సమీపంలోని గంగారం గుట్ట వద్ద విద్యుత్ లైన్లకు గడ్డి తగలడంతో మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ చాకచక్యంతో డీసీఎం నుంచి బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామస్తులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చినా.. వారు వచ్చే సరికే డీసీఎం పూర్తిగా కాలిపోయింది.
బస్సు, కారు ఢీ:
11 మంది గాయాలు
కల్వకుర్తి రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని సీపీఎం కళాశాల సమీపంలో గురువారం కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు వెళ్తున్న అచ్చంపేట డిపో బస్సు, చారకొండ మండలంలోని జూపల్లి నుంచి కల్వకుర్తి వైపు వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శివ, అతడి బావమరిది తరుణ్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న వంగూరు మండలంలోని కిష్టంపల్లితండాకు చెందిన రవి, జయప్రకాష్‌నగర్ తండాకు చెందిన లక్ష్మయ్య, గాయత్రి, కల్వకుర్తికి చెందిన లక్ష్మణ్‌చారి, ధనమ్మ, శాంతమ్మ, కలమ్మ, కార్తీక్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులు కొందరు కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రిలో, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బస్సు డ్రైవర్ విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ శివపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.
చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
కల్వకుర్తి రూరల్: ప్రతి విద్యార్థి చదువుతోపా టు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఐటీడీఏ పీవో సలోని చబ్ర కోరారు. గురువా రం కల్వకుర్తి పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల క్రీడా జట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీలకు జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు రెండు ఉమ్మడి జిల్లాల నుంచి 1200మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదట విద్యార్థుల మార్చ్ ఫస్ట్ నిర్వహించి క్రీడాజ్యోతి వెలిగించారు. క్రీడాకారులను అతిథులు పరిచయం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీడీఏ పీవో మాట్లాడారు. విద్యార్థులకు క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలన్నారు. క్రీడలతో మనోధైర్యం, మానసికోల్లాసం లభిస్తాయని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని నేటి ఓటమిని రేపటి గెలుపునకు పునాది చేసుకోవాలని కోరారు. అట్టహాసంగా సాగిన పోటీల్లో వందమంది క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరంతా డిసెంబర్ 21నుంచి 23వరకు భద్రాచలంలో నిర్వహించే ఆశ్రమ పాఠశాలల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో డీటీడీఓ కోటాజి, ఏటీడీఓ నాగరాజ్, మున్సిపల్ చైర్మన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానావాజ్ ఖాన్, శంకర్, తిరుపతయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


