మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ బస్సుల్లో నెలవారీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ) పథకంలో ఈనెల 14 నుంచి పలు అదనపు సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తున్నామని ఆర్‌ఎం పి.సంతోష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు ఎంఎస్‌టీ అమ్మకాల పక్షోత్సవం నిర్వహించనున్నామన్నారు. ఈ టికెట్లకు దూర పరిమితి తొలగించామని, నిర్ణీత రూట్‌లో ఎంత దూరమైనా ప్రజలు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఎంఎస్‌టీలో టోల్ ప్లాజా చార్జీలను 25 రోజులకు బదులుగా కేవలం 20 రోజులకే లెక్కిస్తామని వివరించారు. రెగ్యులర్ ప్రయాణికుల కోసం కొత్తగా డీలక్స్ ఎంఎస్‌టీ ప్రవేశపెడుతున్నామని, దీంతో ఈ–డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని, ఇతర రూట్లలో సూపర్ లగ్జరీ, అంతకంటే పై కేటగిరీ బస్సుల్లో బేసిక్ చార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నామని తెలిపారు. రెండు నెలల ఎంఎస్‌టీకి అదనంగా ఐదు రోజులు, మూడు నెలలకై తే పది రోజులు చెల్లుబాటు అయ్యేలా గడువు పొడిగించామని పేర్కొన్నారు. ఇక మహిళలకు టోల్ చార్జీలతో సహా 20 రోజులకు బదులుగా కేవలం 15 రోజుల చార్జీలను మాత్రమే లెక్కిస్తామని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బాలల హక్కులపై
అవగాహన కల్పించాలి
మహబూబ్‌నగర్ రూరల్: బాలల హక్కుల పరిరక్షణతోపాటు ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడమే జిల్లా న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని కార్యదర్శి డి.ఇందిర అన్నారు. న్యాయసేవా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రామచంద్రాపూర్‌లో న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉచిత న్యాయ సహాయం, బాలల ప్రత్యేక న్యాయ సేవలు, వరకట్న నిషేధ చట్టం, మానసిక, మేధో వైకల్యం కలిగినవారి న్యాయ హక్కులపై అవగాహన కల్పించారు. అర్హులైనవారు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, బాలలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ, సైబర్ భద్రత, విద్యాహక్కు చట్టంపై వివరించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సిములు, పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
విద్యార్థులను ఇంటికి
పంపడం సరికాదు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ విశ్వవిద్యాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను బలవంతంగా ఇంటికి పంపించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి చెందిన ఈ–1, ఈ–2, డీ హాస్టళ్లలో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని ఖండించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తోందని విమర్శించారు. హాస్టళ్లలోనే ఉండి చదువుకుంటామని కోరిన విద్యార్థులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రాహుల్‌గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందించి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, బీఆర్‌ఎస్వీ నాయకుడు గణేష్ పాల్గొన్నారు.
బాదేపల్లి యార్డుకు
పోటెత్తిన ధాన్యం
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం ధాన్యం పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి 12 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ.3,959, కనిష్టంగా రూ.2,479 ధరలు లభించాయి. అదేవిధంగా 1854 బస్తాల మొక్కజొన్న రాగా గరిష్టంగా రూ.3,214, కనిష్టంగా రూ.2,869, వేరుశనగ రూ.8,013 ధరలు పలికాయి.


