● ఉద్యోగుల అటెండెన్స్‌కు
‘మీ ప్రమాణం’ యాప్
● ముఖ గుర్తింపు, జీపీఎస్
ఆధారంగానమోదు
జడ్చర్ల: వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అధికారులు, ఉద్యోగుల హాజరు నమోదుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నెల 5 నుంచి ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా ముఖ గుర్తింపుతో హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించింది. మార్కెట్ కమిటీ కార్యాలయాలు, మార్కెట్ యార్డుల్లో పనిచేసే రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఈ విధానం వర్తిస్తుంది. ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వ్యక్తిగత వివరాలు, విధులు నిర్వహించే కార్యాలయ లొకేషన్‌ను నమోదు చేయాలి. ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరైనప్పుడు, సాయంత్రం 5 గంటలకు వెళ్లే సమయంలో ముఖ గుర్తింపు ద్వారా ఇన్–ఔట్ హాజరు వేయాలి. ఫేషియల్ రికగ్నిషన్, జీపీఎస్ సాంకేతికతతో ఉద్యోగి కార్యాలయ పరిధిలోనే ఉన్నారా లేదా అనేది నిర్ధారించే వీలుంటుంది. ఈ విధానంతో ఆలస్యంగా రావడం, ముందుగా వెళ్లిపోవడం, ఇతరుల తరఫున హాజరు నమోదు చేయడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. అయితే మార్కెట్ యార్డుల్లో రాత్రి వరకు విధులు నిర్వహించాల్సిన సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 7 గంటలకు చెక్‌పోస్టుల్లో విధులు ప్రారంభించి, అర్ధరాత్రి దాటిన తర్వాత ముగించే సిబ్బంది హాజరు మరుసటి రోజుకు నమోదయ్యే సమస్య ఉందని పేర్కొంటున్నారు. ఈ సమస్యలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొత్త విధానంతో రైతులకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండటంతోపాటు సేవల్లో జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు.


