● నసురుల్లాబాద్ హైస్కూల్‌లో అదనపు కలెక్టర్ తనిఖీ
● ప్రధానోపాధ్యాయుడితో పాటు
ఆరుగురికి షోకాజ్ నోటీసులు
జడ్చర్ల టౌన్: మండలంలోని నసురుల్లాబాద్ జెడ్పీ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడితో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంపై అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా ముగ్గురు ఉపాధ్యాయులే విధుల్లో ఉన్నారు. విచారణలో ప్రధానోపాధ్యాయుడు మారుతి నారాయణతో పాటు ఉపాధ్యాయులు సుశీల, శ్రీనివాస్‌గౌడ్, శంకర్, మంజుల, రాఘవేంద్ర, చామంతి 50 మంది విద్యార్థులతో ఎడ్యుకేషన్ టూర్‌కు వెళ్లినట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం సత్యనారాయణరెడ్డి తెలిపారు. అయితే టూర్‌కు రాతపూర్వక అనుమతులు ఇవ్వలేదని డీఈఓ విజయకుమారి అదనపు కలెక్టర్‌కు వివరించారు. పీఎంశ్రీ పాఠశాలలకు మాత్రమే టూర్ అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడితో పాటు ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, లిఖితపూర్వక వివరణ తీసుకోవాలని డీఈఓను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, సమయపాలనలో నిర్లక్ష్యం వహించరాదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. కాగా.. ఎడ్యుకేషన్ టూర్‌కు సంబంధించి డీఈఓ కార్యాలయంలో ఇన్‌వార్డులో లేఖ అందించారని ఇన్‌చార్జి ప్రదానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు.


