మదనాపురం: కార్తీక మాసపు చలిగాలులు వీస్తున్న వేళ.. పాలమూరు పల్లెల్లో ఆప్యాయతల వెచ్చదనం వెల్లివిరుస్తుంది. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే చాలు.. చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సహా చుట్టుపక్కల గ్రామాల్లో పండుగ సందడి మొదలవుతుంది. ఏడాదంతా ఎక్కడెక్కడో ఉంటున్న ఆడపడుచులు, బంధుమిత్రులు పుట్టింటికి చేరుకుంటారు. ఇళ్లన్నీ బంధువులతో కళకళలాడుతాయి. గాజుల గలగలలు, చిన్నారుల కేరింతలు, ఆత్మీయ పలకరింపులు పల్లెలకు కొత్త కళను తీసుకొస్తాయి. ఇక్కడ కురుమూర్తి జాతర అంటే కేవలం స్వామివారి ఉత్సవం కాదు.. బంధాలను కలిపే ఆత్మీయ వేడుక.. తరతరాలుగా కొనసాగుతున్న పల్లె సంస్కృతికి ప్రతీక.
40 రోజుల పాటు పండుగ కళ
జాతరకు వారం, పది రోజుల ముందే అమ్మాపురం, చిన్నచింతకుంట, దుప్పల్లి, కురుమూర్తి, గూడూరు, తిరుమలాపురం, దాసర్‌పల్లి, అప్పంపల్లి, ఎంకంపల్లి, వెంకటగిరి, పేరూరు, కౌకుంట్ల, మద్దూరు, అల్లిపురం, ఎదులాపురం తదితర గ్రామాలు ముస్తాబవుతాయి. ఇళ్లకు కొత్త సున్నాలు, వాకిళ్లలో రంగవల్లులు.. ఇలా ప్రతి ఇంటా పండుగ వాతావరణం కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారూ జాతరకు తరలివస్తారు. పొలం పనుల నుంచి కాస్త విరామం తీసుకుని కుటుంబసభ్యులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు.
ఆడపడుచుల రాకతో సందడే సందడి
ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ ఆడపడుచుల రాక. అత్తారింటికి వెళ్లిన కుమార్తెలు, సుదూర ప్రాంతాల్లో నివసించే బంధువులను పుట్టింటికి ఆహ్వానించడం ఇక్కడి సంప్రదాయం. జాతరకు తప్పక రావాలంటూ ముందుగానే పిలుపులు వెళ్తాయి. కుటుంబసమేతంగా వచ్చిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఏడాదంతా నిశ్శబ్దంగా ఉండే పల్లె వీధులు బంధుమిత్రుల పలకరింపులతో సందడిగా మారతాయి.
భక్తులసేవలో అమ్మాపురం
కురుమూర్తికొండకు సమీపంలోని అమ్మాపురం గ్రామస్తులు బ్రహ్మోత్సవాలను తమ ఇంటి వేడుకగా భావిస్తారు. యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మంచినీరు అందించడం, అన్నదానాలు నిర్వహించడం, వృద్ధులకు కొండ ఎక్కడంలో సహకరించడం, పోలీసులతో కలిసి రద్దీని నియంత్రించడం వంటి సేవలు చేస్తారు. ఏ భక్తుడూ ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో గ్రామస్తులంతా ఏకమవుతారు. ఇలా కురుమూర్తి బ్రహ్మోత్సవాలు భక్తితోపాటు ఆతిథ్యం, ఆప్యాయత, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
కురుమూర్తిస్వామి చెంత ఆప్యాయతల పండుగ..
ఆడపడుచులు, బంధుమిత్రుల రాకతో పల్లెల్లో 40 రోజుల పండుగ సందడి
పుట్టింటి గాజులు.. బొగ్గులపై కాల్చిన మాంసం విందులు
భక్తుల సేవలో తరించే గ్రామాలు..
తరతరాల అనుబంధానికి బ్రహ్మోత్సవాలు వేదిక


