సైబర్‌ నేరగాళ్ల మోసం.. | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల మోసం..

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

● కూలీ అకౌంట్‌ నుంచి రూ.లక్ష మాయం

మల్దకల్‌: కష్టపడి కూలీ పని చేసి సంపాదించుకున్న డబ్బు రూ.లక్షను సైబర్‌ మోసగాళ్లు కొల్లగొట్టిన ఘటన గురువారం మల్దకల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని మద్దెలబండ పెద్దతండాకు చెందిన సురేష్‌నాయక్‌ హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కూలీలకు డబ్బులు చెల్లించేందుకు తన బ్యాంకు ఖాతాను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు ఓ మెసేజ్‌ వచ్చింది. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష కాజేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు సైబర్‌ నేరగాళ్ల పాలవడంతో బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి, తనకు న్యాయం చేయాలని సురేష్‌నాయక్‌ కోరాడు.

దాడి కేసులో ఐదేళ్ల జైలుశిక్ష

గద్వాల క్రైం: ఆయుధాలతో దాడి చేసిన నిందితులకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 8వేల చొప్పున జరిమానా విధిస్తూ గద్వాల సీనియర్‌ సివిల్‌జడ్జి కమ్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి నాగరాజు గురువారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన వివరాల మేరకు.. గద్వాల మండలం ముల్కలపల్లికి చెందిన తెలుగు శ్రీనివాసులుపై 2022 ఫిబ్రవరి 28న అదే గ్రామానికి చెందిన దేవర్ల పాపమ్మ (ప్రస్తుత నివాసం వనపర్తి జిల్లా అమరచింత) తమ తల్లిదండ్రుల మన్యం భూమిని దక్కకుండా, కులానికి దక్కేలా చేస్తున్నాడనే ధ్వేషంతో ఆమె అనుచరులు, కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ క్రమంలో బాధితుడు గ్రామస్తుల సహాయంతో ప్రాణాలు దక్కించుకుని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్‌ఐ ఆనంద్‌ 17మందిపై కేసులు నమోదు చేశారు. కోర్టులో ఈ కేసు ట్రయల్స్‌ సమయంలో విచారణ అధికారులు చార్జ్‌షీట్‌ దాఖలుచేసి, పూర్తి సాక్ష్యాధారాలను అందజేశారు. పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులైన దండు తిరుమలేష్‌, దండు పరుశరాముడు, దండు కరుణాకర్‌, జంగిడి మణికంఠ, దేవర్ల పాపమ్మ అలియాస్‌ దండు పాపమ్మ, దండు లక్ష్మికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 8వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. దోషులకు శిక్ష పడేలా డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, అప్ప టి ఎస్‌ఐ ఆనంద్‌, ప్రస్తుత ఎస్‌ఐ శ్రీకాంత్‌, అడిషనల్‌ పీపీ జె.సుగుణాదేవి, కోర్టు లైజన్‌ ఆఫీస ర్‌, సిబ్బంది కృషి చేశారని ఎస్పీ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మొబైల్‌ కోర్టు స్టెనోగ్రాఫర్‌ మృతి

మహబూబ్‌నగర్‌ క్రైం: స్వీట్స్‌ దుకాణంలో పలు రకాల స్వీట్స్‌ తీసుకొని రోడ్డు దాటుతున్న మహిళను ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. నగరానికి చెందిన సాగరిణి (34) ఆమె ఆడపడచుతో కలిసి బుధవారం రాత్రి శ్రీనివాస కాలనీలో ఉన్న ఓ స్వీట్‌ హౌజ్‌లో స్వీట్స్‌ తీసుకొని ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో మెట్టుగడ్డ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు రాము వారిని వేగంగా ఢీకొట్టడంతో సాగరిణికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు సాగరిణి జిల్లా మొబైల్‌ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మృతురాలి భర్త రాజుకిషోర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భూ పంచాయితీతోరైతు ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్‌ క్రైం: అన్నదమ్ముల మధ్య భూమి విషయంలో ఏర్పడిన వివాదంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హన్వాడ మండలం గుడిమల్కాపూర్‌కు చెందిన గోపాల్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ఇంట్లో పురుగుల మందు తాగా డు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. గోపాల్‌రెడ్డికి మరో ఇద్దరు అన్నదమ్ములు ఉండగా, వారి మధ్య భూమి విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇటీవల పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ భూమి చదును చేసే విషయంలో మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి భార్య మహేశ్వరి, ఇద్దరు కుమార్తెలు శ్రావణి, ప్రవళిక ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని హన్వాడ ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement