ఇరిగేషన్‌ డీఈఈపై ఏసీబీ కొరడా! | - | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌ డీఈఈపై ఏసీబీ కొరడా!

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

కందనూలు/ఖిల్లాఘనపురం: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలపై ఇరిగేషన్‌శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణగౌడ్‌ నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం కలకలం రేపింది. గురువారం హైదరాబాద్‌ నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రానికి చేరుకున్న ఏసీబీ అధికారుల బృందం.. ఉయ్యాలవాడ సమీపంలోని ఇరిగేషన్‌శాఖ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం 10 బృందాలుగా ఏర్పడి సత్యనారాయణగౌడ్‌ స్వగ్రామమైన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని షాపురంతో పాటు హైదరాబాద్‌లోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

తెల్లవారుజామునే స్వగ్రామానికి..

నీటిపారుదలశాఖ డీఈఈ సత్యనారాయణగౌడ్‌ స్వగ్రామమైన షాపురంలో తనిఖీలు చేపట్టేందుకు ఏసీబీ అధికారుల బృందాలు తెల్లవారుజామునే ఖిల్లాఘనపురం మండలానికి చేరుకున్నారు. వనపర్తి – మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై వాహనాలు నిలిపిన అధికారులు.. డీఈఈ గ్రామంలోనే ఉన్నారా లేదా అని ఆరా తీశారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మూడు బృందాలుగా ఏర్పడి, నేరుగా గ్రామానికి చేరుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు లింగస్వామి, సయ్యద్‌ జిలానీ బృందాలు డీఈఈ ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరో బృందం అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కాగా, సత్యనారాయణగౌడ్‌ తమ్ముడు శ్రీశైలంగౌడ్‌ ఇల్లు, వ్యవసాయ పొలంలో ఉన్న ఫాంహౌస్‌లో కూడా సోదాలు నిర్వహించారు. రాత్రి వరకు అధికారుల తనిఖీలు కొనసాగాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే విధులు..

ఖిల్లాఘనపురం మండలం షాపురం గ్రామానికి చెందిన రాగిరి సత్యనారాయణగౌడ్‌ 2005లో ఇరిగేషన్‌శాఖలో ఏఈగా విధుల్లో చేరారు. 2012లో డీఈఈగా పదోన్నతి పొందిన ఆయన.. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని కేఎల్‌ఐ, ఏదుల తదితర ప్రాంతా ల్లో విధులు నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని పలు మండలాలకు సాగునీటిని అందించడంతో పాటు కమాలొద్దీన్‌పూర్‌ బ్రాంచ్‌ కెనాల్‌, ఖిల్లాఘన పురం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు తీసుకొచ్చేందుకు చేపట్టిన కాల్వల పనుల్లో చురుకుగా పనిచేశారని పేరుంది. ప్రస్తుతం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇరిగేషన్‌ డివిజన్‌–3లో డీఈఈగా విధులు నిర్వహిస్తున్నారు.

ఆదాయానికి మించి

ఆస్తులున్నాయనే ఆరోపణలు

10 బృందాలుగా విడిపోయి 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

స్వగ్రామం షాపురం నుంచి హైదరాబాద్‌ వరకు తనిఖీలు

డీఈఈని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement