వరికి భారీ కోత.. ప్రత్యామ్నాయానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

వరికి భారీ కోత.. ప్రత్యామ్నాయానికి పెద్దపీట

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): యాసంగి సాగు ప్రణాళికలో వ్యవసాయ శాఖ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. నీటి లభ్యత తగ్గడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, విద్యుత్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అధిక నీటి అవసరమయ్యే వరి, మొక్కజొన్న సాగును తగ్గించి ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2026–27 యాసంగి కార్యాచరణ ప్రణాళికలో గత సీజన్‌తో పోలిస్తే వరి సాగు లక్ష్యాన్ని ఏకంగా 90 శాతానికి పైగా తగ్గించింది. గత యాసంగిలో 2,02,004 ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈసారి 20,600 ఎకరాలకే పరిమితం చేయాలని ప్రతిపాదించింది. మరోవైపు అపరాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత యాసంగిలో మొత్తం వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలిపి 2,46,205 ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి 88,155 ఎకరాలకే ప్రణాళిక రూపొందించడం గమనార్హం. మొత్తంగా 1,58,050 ఎకరాల సాగు తగ్గింపును లక్ష్యంగా పెట్టుకున్నారు.

అడుగంటుతున్న జలాలు

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు యాసంగి సాగుపై ప్రభావం చూపుతున్నాయి. అక్టోబర్‌ 31 నాటికి సాధారణ వర్షపాతం 607.9 మి.మీ. కాగా.. 378.2 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో 37.8 శాతం లోటు నెలకొంది. జిల్లాలోని 17 మండలాలకు గాను 13 మండలాల్లో వర్షపాతం లోటు నమోదైంది. చిన్నచింతకుంటలో అత్యధికంగా 62.2 శాతం లోటు ఉండగా.. మహబూబ్‌నగర్‌ రూరల్‌లో 52.4, అర్బన్‌లో 52, కోయిలకొండలో 43.5 శాతం లోటు ఉంది. నవాబుపేట, గండేడ్‌, మహమ్మదాబాద్‌ మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మరోవైపు భూగర్భ జలమట్టాలు సైతం గణనీయంగా పడిపోయాయి. గతేడాది అక్టోబర్‌లో జిల్లా సగటు నీటిమట్టం 5.39 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 11.96 మీటర్ల లోతుకు చేరింది. ఏడాది వ్యవధిలో 6.57 మీటర్ల మేర తగ్గింది. హన్వాడలో అత్యధికంగా 21.64 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

అపరాలు.. నూనెగింజలకు ప్రోత్సాహం

ఈ యాసంగిలో వరిని 20,600 ఎకరాలకే పరిమితం చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. మొక్కజొన్న సాగును 30,669 ఎకరాల నుంచి 5 వేల ఎకరాలకు కుదించారు. ఈ రెండు పంటల విస్తీర్ణం తగ్గింపుతోనే మొత్తం సాగు ప్రణాళికలో భారీ మార్పు కనిపిస్తోంది.

● నీటి వినియోగం తక్కువగా ఉండే అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తున్నారు. గత యాసంగిలో కేవలం 214 ఎకరాల్లో సాగైన మినుములను ఈసారి 8,500 ఎకరాలకు, రెండు ఎకరాల్లో సాగైన పెసరను 8,500 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేరుశనగను 10,547 నుంచి 15,814 ఎకరాలకు విస్తరించాలని ప్రతిపాదించింది. నువ్వుల సాగును మూడు నుంచి 1,850 ఎకరాలకు, కుసుమను 44 నుంచి 2,040 ఎకరాలకు, పొద్దుతిరుగుడును 36 నుంచి 850 ఎకరాలకు పెంచాలని ప్రణాళికలో పేర్కొంది. ఆముదం, జొన్న, పశుగ్రాస జొన్న సాగుకూ ప్రాధాన్యమిచ్చింది. జొన్న సాగును 463 నుంచి 8,500 ఎకరాలకు, పశుగ్రాస జొన్నను 294 నుంచి 2,500 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది.

లక్ష్యాల సాధనకు సవాళ్లు

ప్రత్యామ్నాయ పంటల సాగుకు భారీ లక్ష్యాలు నిర్దేశించినా.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం అంత సులువు కాదు. రైతులకు అవగాహన కల్పించడంతోపాటు నాణ్యమైన విత్తనాలు, సాగు పద్ధతులపై మార్గదర్శకత్వం అవసరం. ముఖ్యంగా అపరాలు, నూనెగింజలకు మార్కెటింగ్‌ సదుపాయాలు, గిట్టుబాటు ధరలపై భరోసా కల్పించాలి. కొనుగోలు వ్యవస్థ పటిష్టంగా లేకపోతే రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకొస్తారా అన్నది ప్రశ్నార్థకమే. నీటి లభ్యతను బట్టి మండలాల వారీగా ప్రణాళిక అమలు చేసి, రైతులకు ఆదాయ భరోసా కల్పిస్తేనే లక్ష్యాలు చేరుకునే అవకాశం ఉంటుంది.

ఉద్యాన పంటల విస్తరణపైనా దృష్టి

వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటల సాగును పెంచాలని నిర్ణయించారు. గత యాసంగిలో 863 ఎకరాల్లో ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని ఈసారి 3,841 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూరగాయల సాగును 534 నుంచి 2,384 ఎకరాలకు, ఉల్లిని 106 నుంచి 452 ఎకరాలకు, ఆయిల్‌పామ్‌ను 119 నుంచి 897 ఎకరాలకు విస్తరించాలని ప్రతిపాదించారు.

యాసంగి సాగు ప్రణాళికలో కీలక మార్పులు

గత సీజన్‌లో 2.02 లక్షల

ఎకరాల్లో వరి సాగు

ఈసారి 20,600 ఎకరాలకే పరిమితం చేయాలని లక్ష్యం

అపరాలు, నూనెగింజలు,

చిరుధాన్యాల విస్తరణకు ప్రాధాన్యం

ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపునకు అధికాకార్యాచరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement