మహబూబ్‌నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 డీఐజీగా అదనపు బాధ్యతలను 2012 బ్యాచ్‌కు చెందిన జి.చందనాదీప్తికి ప్రభుత్వం అప్పగించింది. ఫ్యూచర్ సిటీ కమిషరేట్ అడ్మిన్ అండ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రెగ్యులర్ పోస్టుతోపాటు జోగుళాంబ జోన్–7 డీఐజీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో డీఐజీగా పనిచేసిన ఎల్‌ఎస్ చౌహాన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆ తర్వాత ఇన్‌చార్జి డీఐజీ బాధ్యతలను మల్టీజోన్–2 ఐజీ షానవాజ్‌ఖాసీంకు ఇవ్వగా.. ఇప్పుడు మళ్లీ రెగ్యులర్ అధికారికి కాకుండా అదనపు బాధ్యతలే అప్పగించడం గమనార్హం. అయితే ఉమ్మడి జిల్లాలో ఎస్పీల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన డీఐజీ పోస్టు రెగ్యులర్ లేకపోవడంతో పోలీస్ శాఖ బాస్‌లపై దృష్టి లేకుండా పోతుంది. అలాగే హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ వరకు చేయాల్సిన బదిలీల అంశంతోపాటు ఇతర ఫైళ్లపై సంతకాల కోసం జిల్లాల నుంచి సిబ్బంది హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది.
ఆరుగురు బాక్సర్ల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి బాక్సింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. 19 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఎంపికలు జరిగాయి. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బెక్కరి మధుసూదన్‌రెడ్డి, బొంబాయి నర్సింలు తెలిపారు. కార్యక్రమంలో శశికిరణ్, కోచ్ శంకర్ పాల్గొన్నారు. 47–50 కేజీల విభాగంలో బి.నిఖిల్‌గౌడ్, 50–55 విభాగంలో జె.రాకేష్, 55–60 విభాగంలో ఎం.రాజు, 60–65 విభాగంలో పి.రాకేష్, 70–75 విభాగంలో ఎస్.యాదయ్య, మహిళల 48–51 కేజీల విభాగంలో జి.శ్రీలేఖను ఎంపిక చేశారు.
బాదేపల్లిలో రికార్డు ధర
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ధాన్యానికి రికార్డు ధర లభించింది. వివిధ ప్రాంతాల నుంచి 9,645 బస్తాల ధాన్యం వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.3,910, కనిష్టంగా రూ.2,511 ధర పలికింది. మార్కెట్ యార్డు చరిత్రలో ధాన్యానికి ఇప్పటి వరకు ఈస్థాయిలో ధర రాలేదని మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 1,332 బస్తాల మొక్కజొన్న రాగా గరిష్టంగా రూ.3,216 కనిష్టంగా రూ.2,901, వేరుశనగ రూ.8106 ధరలు పలికాయి.


