రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

Nov 12 2026 1:01 AM | Updated on Nov 12 2026 1:01 AM

అడ్డాకుల: మండలంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ మురళి వివరాల ప్రకారం.. మండలంలోని పొన్నకల్‌ గ్రామానికి చెందిన రాజుయాదవ్‌, కేశమ్మ (42) దంపతులు కొన్నాళ్లుగా మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ షోరూంలో విధులు నిర్వహిస్తూ అక్కడే నివాసముంటున్నారు. కేశమ్మ బుధవారం మహబూబ్‌నగర్‌ నుంచి పొన్నకల్‌కు వస్తూ గ్రామ స్టేజీ వద్ద బస్సు దిగింది. అక్కడి నుంచి గ్రామానికి వెళ్లేందుకు 44వ నంబర్‌ జాతీయ రహదారిని దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేశమ్మ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌లో క్షతగాత్రురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కారులో ప్రయాణిస్తున్న దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం దెబ్బతింది. మృతురాలి పెద్ద కుమార్తె అక్షయకు ఇటీవల ఎంబీబీఎస్‌లో సీటు రాగా, చిన్న కుమార్తె తేజ ఇంటర్‌ చదువుతోంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మురళి తెలిపారు.

వరుస ప్రమాదాలతో బెంబేలు

మంగళవారం ఉదయం మూసాపేట వద్ద రోడ్డు దాటుతున్న యువతిని లారీ ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. మరుసటి రోజే మరో మహిళ ఇలాంటి ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పొన్నకల్‌ స్టేజీ, కందూర్‌ స్టేజీ వద్ద అండర్‌పాస్‌ నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు రహదారి నిర్వాహకులను కోరుతున్నారు. రోడ్డు దాటే క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement