● పెండింగ్ ప్రాపర్టీ కేసుల ఛేదనకు ప్రాధాన్యం
● డయల్ 112 ఫిర్యాదులపై తక్షణ స్పందన: పేట ఎస్పీ వినీత్
నారాయణపేట: నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రతి గ్రామంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ, హత్య కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా పటిష్ట ఆధారాలు సేకరించాలని సూచించారు. పెండింగ్ వారెంట్ల అమలుతో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా పెంచి, ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, డయల్ 112 కాల్స్‌కు సకాలంలో పోలీసు సహాయం అందించాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యమిస్తూ షీ టీమ్స్, భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, దర్యాప్తులో జాప్యం సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఆర్‌బీ డీఎస్పీ మహేష్, సీఐలు శివశంకర్, రామ్‌లాల్, భగవంత్‌రెడ్డి, ఆర్‌ఐ విజయ్ భాస్కర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


