కృష్ణా జలాలు అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దే | - | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలు అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దే

Nov 12 2026 12:55 AM | Updated on Nov 12 2026 12:55 AM

పాలమూరు: పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు అభివృద్ధి కుంటుపడిందని, ఈ ప్రాంత ప్రజల నీటి హక్కులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. తెలంగాణకు 299 టీఎంసీల నీరు సరిపోతుందని అప్పటి సీఎం కేసీఆర్‌ అంగీకరించారని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి కృష్ణా జలాలను అమ్ముకున్న చరిత్ర ఆయనదని విమర్శించారు. తెలంగాణకు 558 టీఎంసీల నీటి వాటా సాధించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. నార్లాపూర్‌ వద్ద పంపుల ఏర్పాటు, కర్వెన, ఉదండాపూర్‌ వద్ద భూసేకరణ సహా అనేక పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. పదేళ్ల పాలనలో పాలమూరు ప్రజల బతుకులు వలసలు, పేదరికం మధ్యే గడిచిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లలో ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి లెక్కలు చూపిస్తుందని తెలిపారు. కొడంగల్‌లో 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌, 250 ఎకరాల్లో ఎడ్యుకేషనల్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకాలతో రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జూరాల నీటిని కోయిల్‌సాగర్‌కు తరలించి నిల్వ సామర్థ్యం పెంచి ఉంటే దిగువ ప్రాంతాలకు ప్రయోజనం కలిగేదన్నారు. ఇతర ప్రాంతాల ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిన గత పాలకులు పాలమూరును విస్మరించారని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఎన్‌పీ వెంకటేశ్‌, సిరాజ్‌ఖాద్రీ, బెనహర్‌, యాదయ్య, కార్పొరేటర్‌ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు–రంగారెడ్డి పనులు 90 శాతం పూర్తయ్యాయనడం హాస్యాస్పదం

తెలంగాణకు 558 టీఎంసీల నీటి వాటా కోసం సీఎం రేవంత్‌రెడ్డి పోరాటం

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement