● ఇప్పటికే రూ.110 కోట్ల నిధులు.. మరో రూ.వంద కోట్లు మంజూరుకు కృషి
● ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి
చిన్నచింతకుంట: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దిగుడు మెట్లు, ఈఓ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ.110 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో కారిడార్, ఎలివేటెడ్ ఘాట్ రోడ్డు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. మరో రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అమ్మాపురం సర్పంచ్ రంజిత్, ఆలయ చైర్మన్ బత్తుల బాల్‌రాజు, ఈఓ మధనేశ్వరరెడ్డి, కమిటీ సభ్యులు మైపాల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, అర్జున్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


