కొల్లాపూర్: పెంట్లవెల్లి మండలం కొండూరు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు నల్లబోతుల గోపాల్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగంతో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ శంకర్‌నాయక్ కథనం ప్రకారం.. కొండూరుకు చెందిన కావలి శివకుమార్ చాలాకాలంగా నల్లబోతుల గోపాల్‌పై రాజకీయ, వ్యక్తిగత కక్షలు పెంచుకున్నాడు. 2017లో గోపాల్‌పై ఆయన హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతనిపై కేసు కూడా నమోదైంది. మళ్లీ ఇటీవల గోపాల్‌ను హత్య చేసేందుకు సహకరిస్తే రూ.5 లక్షలు ఇస్తానంటూ అదే గ్రామానికి చెందిన నల్లబోతుల నరేష్, నల్లబోతుల నాగరాజు, నల్లబోతుల బాలు అనే యువకులకు ఆఫర్ చేశాడు. దీంతో ముగ్గురు యువకులు రెండురోజులపాటు గోపాల్ ఇంటిచుట్టూ రెక్కీ నిర్వహించారు. ఈనెల 1వ తేదీన గ్రామంలోని వరలక్ష్మీ అనే మహిళకు చెందిన కిరాణం దుకాణం వద్దకు వెళ్లి గోపాల్‌ను హత్యచేసి అతని తలను తీసుకొచ్చి మీ ఫ్రిజ్‌లోనే పెడతామని చెప్పారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కూర్చొని గోపాల్‌ను హత్య చేస్తామంటూ కేకలు వేశారు. విషయం తెలిసి ఈనెల 5వ తేదీన గోపాల్ పెంట్లవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు విషయం తెలియడంతో నలుగురు యువకులు ఈనెల 6వ తేదీన గ్రామం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిని పెద్దకొత్తపల్లి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రాజకీయ, వ్యక్తిగత కక్షలతో ఎవరైనా నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. సమావేశంలో పెంట్లవెల్లి ఎస్‌ఐ పవన్‌కుమార్ తదితరులున్నారు.
నలుగురు యువకుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు


