నారాయణపేట: హకీంపేట, లగచర్ల భూ నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం, పునరావాస ప్యాకేజీని మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు కూడా వర్తింపజేయాలని భూ నిర్వాసితుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యక్షులు ధర్మరాజు గౌడ్, గోపాల్‌రెడ్డి, గోపాల్ మాట్లాడుతూ.. ఒకే జిల్లాలో భూములు కోల్పోతున్న రైతులపై ప్రభుత్వం వివక్ష చూపకుండా సమన్యాయం చేయాలని కోరారు. సీఎం ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి అయి ఉండి హకీంపేట, లగచర్ల భూ నిర్వాసితులకు ఒక విధంగా, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు మరోవిధంగా పరిహారం అందించడం సమంజసం కాదన్నారు. హకీంపేట, లగచర్లలో ఎకరాకు రూ.25లక్షల పరిహారంతోపాటు ప్లాట్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు తమకు కూడా అదే ప్యాకేజీ వర్తింపజేయాలని స్పష్టం చేశారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన పరిహారం, పునరావాసమే కోరుతున్నామని తెలిపారు. నిర్వాసితులపై వివక్షపూరిత వైఖరిని ప్రభుత్వం విడాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి, వినతిపత్రం అందజేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం సలహాదారు బండమీది బలరాం, నాయకులు నర్సింహులు, ఆంజనేయులు, లక్ష్మీకాంత్, మహేష్‌కుమార్‌గౌడ్, మొగులప్ప, నారాయణ, రవి, వెంకటప్ప, కురుమూర్తి, రాజుగౌడ్, నర్సింహులు, నరసప్ప, నర్సింహులుగౌడ్, శివప్పయ్య తదితరులు పాల్గొన్నారు.


