● ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
● నేడు జిల్లావ్యాప్తంగా పండుగ సంబరాలు
● చీకటిపై వెలుగు.. చెడుపై మంచి విజయానికి ప్రతీక
● శుభాలు, సిరిసంపదలు తీసుకొచ్చే దీపావళి
నగరంలో
దీపావళి సందడి..
మహబూబ్‌నగర్ నగరంలో రెండు, మూడు రోజుల నుంచి దీపావళి సందడి నెలకొంది. బాణాసంచా స్టాళ్ల వద్ద చిన్నారులు, పెద్దలు టపాసులు కొనుగోలు చేస్తున్నారు. గ్రీన్ టపాసుల కొనుగోలుపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా మహిళలు వివిధ రకాల ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. షాపుల్లో కూడా దీపావళి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలు చోట్ల ప్రత్యేకంగా పూల స్టాళ్లు వెలిశాయి. పూజా సామాగ్రికి సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. పండుగ కొనుగోలుతో క్లాక్‌టవర్, పాన్ చౌరస్తా మార్కెట్లో ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.
ఇతర రాష్ట్రాల
నుంచి దిగుమతి..
స్టేషన్ మహబూబ్‌నగర్: అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే దీపం.. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే సందేశం.. చెడుపై మంచి, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీక.. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విశిష్టతలు, పురాణ గాథలు, తరతరాల సంప్రదాయాల సమాహారమే దీపావళి పర్వదినం. ప్రతి ఇంటా దీపాల కాంతులు విరజిమ్ముతూ.. లోగిళ్లలో రంగవల్లులు, ముంగిట ప్రమిదల వెలుగులు, పిల్లల కేరింతలు, పెద్దల పూజలతో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ.. కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ ఆదివారం జిల్లావ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఇందుకోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో దీపారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఆశ్వీయుజ మాస అమావాస్య రోజున జరుపుకునే ఈ పర్వదినాన్ని ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి దీపావళి, దీపాలిక, కౌముదీ మహోత్సవం, దివ్వెల పండుగగా పిలుస్తారు. దీపాన్ని జ్ఞానానికి, పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఇంటి గడప నుంచి దేవాలయాల వరకు దీపాల వరుసలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు, మరికొన్ని చోట్ల ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తారు.
కొంతమంది స్టాళ్ల నిర్వాహకులు కొన్ని ప్రమిదలను ఇక్కడే తయారు చేసి విక్రయిస్తుస్తున్నారు. వివిధ డిజైన్ల మట్టి దీపాలను తమిళనాడు, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు దిగుమతి అవుతుండగా అక్కడి నుంచి స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి స్టాళ్లలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రమీదలను వాటి పరిణామం, డిజైన్‌ను బట్టీ విక్రయిస్తున్నారు. ముఖ్యంగా కందీల్ దీపాలు, గాజుతో చూసిన దీపాలు, ఐదు క్యాండిల్స్ దీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నపాటి దీపాలు డజన్ రూ.40 నుంచి అమ్ముతుండగా ఇతర దీపాలు రూ.1500 వరకు కూడా లభిస్తున్నాయి. వాటర్‌ఫ్లవర్, ఎలక్ట్రిక్ ప్రమీదలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ప్రమిదలకు ఫుల్ గిరాకీ
దీపావళిలో ప్రమిదలు (మట్టి దీపాలకు) ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగకు ఇంటిల్లిపాది దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి సందర్భంగా పట్టణాల్లో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. ప్రతి ఏడాది వివిధ డిజైన్లలో అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో ఏనుగొండ, పద్మావతీకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి, జిల్లా పరిషత్ ఎదుట, మల్లికార్జున్ చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా, క్లాక్‌టవర్, బస్టాండ్, పాన్‌చౌరస్తాలతోపాటు భూత్పూర్ చౌరస్తా, దేవరకద్ర, జడ్చర్లలోని సిగ్నల్‌గడ్డతో పాటు పలు ప్రాంతాల్లో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి.


