భద్రతా నిబంధనలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

భద్రతా నిబంధనలు తప్పనిసరి

Nov 8 2026 5:11 AM | Updated on Nov 8 2026 5:11 AM

● నిర్వాహకులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి: జిల్లా అగ్నిమాపక అధికారి గిరిధర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ క్రైం: దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా దుకాణాల నిర్వాహకులు, ప్రజలు అగ్నిప్రమాదాల నివారణకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి గిరిధర్‌రెడ్డి సూచించారు. జిల్లాలో తాత్కాలిక బాణసంచా దుకాణాల ఏర్పాటుకు మహబూబ్‌నగర్‌లో 76, జడ్చర్లలో 18 కలిపి మొత్తం 94 లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపారు. దుకాణాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనుమతించిన బహిరంగ ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలని, మంటలు అంటుకోని సామగ్రితో షెడ్లు నిర్మించాలన్నారు. దుకాణం చుట్టూ నాలుగు వైపులా కనీసం మూడు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి. ఒక్కో దుకాణంలో 6 కిలోల సామర్థ్యం గల రెండు డీసీపీ ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, 200 లీటర్ల నీటితో నింపిన రెండు డ్రమ్ములు, రెండు ఇసుక, రెండు నీటి బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దుకాణాల వద్ద ధూమపానం, మంటలు వెలిగించడం, బాణసంచా కాల్చడం నిషేధమన్నారు. అనుమతించిన పరిమాణంలోనే నిల్వ ఉంచి విక్రయాలు చేపట్టాలన్నారు.

● అగ్నిప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అత్యవసర సేవలకు సమాచారం అందించాలని, కాలిన గాయాలైన ప్రాంతాన్ని 20 నిమిషాల పాటు చల్లని ప్రవహించే నీటితో చల్లబరిచి వైద్య సహాయం పొందాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటిస్తూ దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలని గిరిధర్‌రెడ్డి కోరారు.

ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు

అనుమతి పొందిన దుకాణాల్లోనే టపాసులు కొనుగోలు చేయాలి.

బహిరంగ ప్రదేశాల్లో పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు కాల్చాలి. కాటన్‌ దుస్తులు, పాదరక్షలు ధరించాలి.

చేతిలో పట్టుకుని టపాసులు కాల్చడం, ఇతరులపైకి విసరడం చేయకూడదు.

వెలగని టపాసులను తిరిగి వెలిగించరాదు.

ఇళ్లు, వాహనాలు, విద్యుత్‌ తీగలు, పెట్రోల్‌ బంకుల సమీపంలో కాల్చకూడదు. అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.

– గిరిధర్‌ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement