దుందువాతో దిష్టి.. దక్షిణ దిక్కున దీపం | - | Sakshi
Sakshi News home page

దుందువాతో దిష్టి.. దక్షిణ దిక్కున దీపం

Nov 8 2026 5:11 AM | Updated on Nov 8 2026 5:11 AM

జడ్చర్ల టౌన్‌: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో సంప్రదాయ వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. గోగునార కట్టలతో చిన్నారులకు దిష్టి తీయడం, దక్షిణ దిక్కుగా దీపం వెలిగించి ఉల్కాదానం చేయడం వంటి ఆచారాలను నిర్వహించనున్నారు. అలాగే అమావాస్య సోమవారం మధ్యాహ్నం వరకు ఉండటంతో కేదారేశ్వర వ్రతాలను ఆదివారమే ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి రోజు గోగునార కట్టలకు గుడ్డ పీలికలు చుట్టి కాగడాలుగా వెలిగించి చిన్నారులకు దిష్టి తీస్తారు. వీటిని గుమ్మం వద్ద నేలకు కొడుతూ సంప్రదాయ పాటలు పాడుతారు. అనంతరం ఆ కట్టలను ఎవరూ తొక్కని చోట పడేసి, వెనక్కి చూడకుండా ఇళ్లకు చేరుకుంటారు. ఈ ఆచారాన్ని దుందువాగా పిలుస్తారు. దుందువా అనంతరం పిల్లలు దక్షిణ దిక్కుగా నిలబడి దీపం వెలిగిస్తారు. దీనినే ఉల్కాదానంగా వ్యవహరిస్తారు. ఈ దీపం పితృదేవతలకు స్వర్గలోకానికి దారి చూపుతుందని విశ్వసిస్తారు. అనంతరం ఇళ్లలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజలు చేస్తారు.

గంగాపురంలో పెద్ద దుందువా..

కార్తీకమాసం సందర్భంగా గంగాపురంలో పెద్ద దుందువా వేడుక నిర్వహించడం ఆనవాయితీ. కార్తీక పాడ్యమి నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటలకు ఈ వేడుక నిర్వహించేందుకు ఆలయ పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దీపావళి సందర్భంగా దుకాణాల్లో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement