● సరైన ప్రోత్సాహం, నాణ్యమైన శిక్షణతో అద్భుత ఫలితాలు: ప్రభుత్వ విప్ యెన్నం
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, నాణ్యమైన శిక్షణ అందిస్తే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు ధీటుగా అద్బుతమైన ఫలితాలు సాధిస్తారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పయనీర్ కార్యక్రమం ద్వారా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానం, సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా నిర్వహిస్తున్న పయనీర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాది వందమంది విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించి వైద్య, ఇంజినీరింగ్‌తో పాటు పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలు పొందడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు మహబూబ్‌నగర్ ఫస్ట్ ద్వారా బాటలు వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో మహబూబ్‌నగర్ ఫస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో టాస్క్ ద్వారా కూడా విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలను మరో పదేళ్లపాటు కొనసాగిస్తే వేలాదిమంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని తెలిపారు. తాము ఎంచుకున్న కోర్సులను పూర్తిస్థాయి ఏకాగ్రతతో చదువుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, డీఐఈఓ సి.రమణి, బాలికల, బాలుర జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు కౌసర్ జహాన్, అలీమోద్దీన్, వాగ్గేవి కళాశాల డైరెక్టర్ విజేత వెంకట్‌రెడ్డి, ప్రతిభ కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, రిషి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


