మహబూబ్‌నగర్ క్రైం: దీపావళి పండగ నేపథ్యంలో జిల్లాలో బాణసంచా విక్రయాలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మహబూబ్‌నగర్ నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో 70, జడ్చర్లలో మరో 31 తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతుల ప్రక్రియ చేపట్టారు. ఈ ఏడాది ప్రభుత్వం నూతన నిబంధనలు అమల్లోకి తీసుకురావడంతో దుకాణాల ఏర్పాటుకు అనుమతుల బాధ్యత పూర్తిగా అగ్నిమాపక శాఖకే అప్పగించారు. గతంలో కలెక్టరేట్ అధికారులు దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వగా, ఫైర్ శాఖ ఎన్‌వోసీ జారీ చేసేది. తాజా నిబంధనల ప్రకారం వ్యాపారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం క్షేత్రస్థాయి అగ్నిమాపక అధికారులు దుకాణాల ఏర్పాటును పరిశీలించి నివేదిక అందిస్తారు. దాని ఆధారంగా జిల్లా అగ్నిమాపక అధికారి అనుమతులు, ఎన్‌వోసీ జారీ చేస్తారు.
నిబంధనలు పాటించకపోతే చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసింది. నూతన నిబంధనల ప్రకారం బాణసంచా వ్యాపారులు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తాం. దరఖాస్తు సమయంలోనే అన్ని భద్రతా ప్రమాణాల వివరాలను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేకుల షెడ్లు తప్పనిసరిగా నిర్మించుకోవాలి. షెడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి, అన్ని ప్రమాణాలు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే అనుమతులు ఇస్తాం.
– మల్లికార్జున్, ఫైర్ ఆఫీసర్
బాణసంచా విక్రయాలకు జిల్లాలో 101 తాత్కాలిక దుకాణాలు
కొత్త నిబంధనల ప్రకారం ఫైర్ శాఖ నుంచే అనుమతులు
భద్రతా ప్రమాణాలు పాటించకుంటే దుకాణాల సీజ్


