● భావితరాలకు పోరాట చరిత్రను పరిచయం చేస్తాం
● విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని
పరిశీలించిన ప్రభుత్వ విప్,
ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ రూరల్: పేదల హక్కుల కోసం పోరాడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు అందిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పండుగ సాయన్న భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం పండుగ సాయన్న సాగించిన పోరాటం, ఆయన త్యాగాలు నేటి యువతకు ఆదర్శమన్నారు. ఆ మహానీయుడి పోరాట స్ఫూర్తిని ప్రజల్లో సజీవంగా ఉంచడంతో పాటు భావితరాలకు ఆయన చరిత్రను పరిచయం చేయడమే విగ్రహ ఏర్పాటు లక్ష్యం అని అన్నారు. స్థల పరిశీలన పూర్తయినందున పరిపాలనాపరమైన అనుమతులు, ఇతర ప్రక్రియలను వేగవంతం చేసి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న తెలంగాణ పర్యాటక శాఖ హోటల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఓబ్లాయిపల్లి గ్రామ సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు మైత్రి యాదయ్య, మల్లు అనిల్‌రెడ్డి, ఖాజా, చంద్రమౌళి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


