● నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆమె పోలీస్‌స్టేషన్ల వారీగా కేసుల పురోగతి, దర్యాప్తు తీరును సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రతి పోలీస్ స్టేషన్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కేసుల్లో అవసరమైన సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించి, నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, కేసుల విచారణలో జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భరోసా కేంద్రం, షీ–టీమ్స్ ద్వారా బాధితులకు తక్షణ సహాయం అందించాలని తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా పెంచి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. సైబర్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, సీసీటీఎన్‌ఎస్ 2.0లో వివరాలను సకాలంలో నమోదు చేయాలన్నారు. నాట్‌గ్రిడ్, గాండీవ వెబ్ అప్లికేషన్లను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, వివిధ పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


