ఎర్రవల్లి: యువ ఆపద మిత్రులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో ప్రాణ రక్షణ చర్యలకు సహకరించాలని పదో పటాలం కమాండెంట్ అలెక్స్ అన్నారు. శుక్రవారం బీచుపల్లి పదవ బెటాలియన్‌లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో యువ ఆపద మిత్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రెండో విడుత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌వైకేఎస్ సంస్థలకు చెందిన 103మంది బాలబాలికలకు ఏడు రోజులపాటు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులను సురక్షితంగా తరలించే విధానాలు, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేసే విధివిధానాలపై శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరిత్యాలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు సంబంధిత అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోగా, సమీపంలో ఉన్న యువత తమకు అందుబాటులో ఉన్న వసరులతో బాధితులకు ప్రాథమిక సహాయం అందించడం, ప్రాణాలను రక్షించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపట్టేలా యువతను సిద్ధం చేయడమే యువ ఆపదమిత్ర కార్యక్రమం ప్రదాన ఉద్దేశమన్నారు. అనంతరం శిక్షణకు అవసరమైన కిట్లను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఆదినారాయణ, అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారదిరెడ్డి, శ్రీను, ఆర్‌ఐలు శ్రీనివాస్, నరసింహరాజు, రాజేశం, తిరుపతి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


