స్వలాభం కోసమే వంద పడకల ఆస్పత్రి | - | Sakshi
Sakshi News home page

స్వలాభం కోసమే వంద పడకల ఆస్పత్రి

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

● మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ధ్వజం

జడ్చర్ల: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన వంద పడకల ఆస్పత్రిని స్వలాభం కోసం నాలాలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించి ప్రజలకు అక్కరకు రాకుండా చేశావని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శుక్రవారం జడ్చర్లలోని అంబేడ్కర్‌ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలను వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రికి కేటాయించిన అసైన్‌ భూమికి సంబంధించి కాస్తులో ఉన్న రైతులకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని బాధిత రైతులతో చెప్పగా.. లక్ష్మారెడ్డి తాను సొంత డబ్బులు వెచ్చించి స్థలాన్ని ఆస్పత్రికి ఇచ్చినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. అంతేగాక ఆస్పత్రికి కేటాయించిన భూమికి సంబంధించి జాతీయ రహదారిని అనుసరించి తన సోదరి పేరున భూమిని ఆక్రమించారని, దీనిపై రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులకు జవాబు చెప్పకుండా కోర్టుకు వెళ్లి స్టేటస్‌కో ఆర్డర్‌ తెచ్చుకున్నారని ఆరోపించారు. తాను ఈ అంశంపై మాట్లాడిన తర్వాత ఆస్పత్రికి నేరుగా రోడ్డు నిర్మిస్తామంటూ ముందుకొచ్చారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉన్నామని, పట్టణ నడిబొడ్డున ఎంపీడీఓ కార్యాలయం ఉన్న స్థలాన్ని ఆస్పత్రికి కేటాయిస్తామని ఇందుకోసం రూ.25 కోట్లు డీడీ కట్టి 15 రోజుల్లో అధికారులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆయన ఇంటిని తమ కార్యకర్తలు ముట్టడిస్తారని హెచ్చరించారు. గంగాపూర్‌– బాలానగర్‌ రోడ్డు నిధులు రూ.56 కోట్ల నుంచి రూ.76 కోట్లకు పెంచిన మాట వాస్తవమేనని, రోడ్డును నాణ్యతగా మరో లేయర్‌ వేయడంతోపాటు మిషన్‌ భగీరథ, విద్యుత్‌ లైన్ల మార్పిడికి అనుగుణంగా అధికారుల ప్రతిపాదనల మేరకే వ్యయాన్ని పెంచామని చెప్పారు. మాజీ మంత్రి తన పదేళ్ల పదవీ కాలంలో రోడ్లకు కేవలం రూ.80 కోట్లు తెస్తే.. తాను మూడేళ్లలోనే రూ.325 కోట్లు తెచ్చానని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ నిత్యానందం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అశోక్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement